భగవంతుని భజించు పుణ్యాత్ములైన భక్తులు నాలుగు విధాలు- ఆపదలకు, ఆయాసాలకు, సంకటాలకు, సంతాపాలకు పాలుపడి పరితపించు ఆర్తులు. వెంకట రమణుని స్మరణకు సాధనం, కారణం కాగలిగిన సంకటం కూడా సాధు (గొప్ప)వేగా! ఆపద కూడా ఆ దృష్టితో సంపదేగా!
భక్తి శాస్త్రరీత్యా భగవత్ స్మరణమే సంపద. విస్మరణమే ఆపద. ప్రాపంచిక వస్తు, విషయాలపై విరక్తి పొంది పారమార్థిక తత్త్వాన్ని తెలుసుకోవాలని తపించేవారు
జిజ్ఞాసువులు. ధన ధాన్యాలను, వస్తు వాహనాలను- తమకు ఇష్టమైన సుఖసంపదలను కోరువారు అర్థార్థులు. భగవత్ తత్త్వాన్ని ఎరిగిన వారు జ్ఞానీ భక్తులు. ముందుగా ముచ్చటించుకున్న ముగ్గురూ, సగుణ భక్తులు, సాధకులు. నాలుగోవాడు- నిర్గుణ, నిష్కామ భక్తుడు నాణ్యమైనవాడు. భగవంతునికి ఇష్టుడు, శిష్టుడు, సిద్ధపురుషుడైన అతడు సాక్షాత్ శుద్ధ బ్రహ్మ స్వరూపుడే! ముందటి ముగ్గురు కూడా మున్ముందు భక్తి యోగపు బలిమితో భగవంతుని చెలిమినే శాశ్వత కలిమిగా భావించి ఆయనను పొందుట కొరకు మాత్రమే భజించే వారు అవుతారు. కథానాయకుడు ధ్రువుడే దీనికి దీటైన దేదీప్యమాన దృష్టాంతం.
నిర్మలమైన బుద్ధిగలవాడు, నిష్కాముడైనా, సర్వం కామించేవాడైనా, కాక కేవల మోక్షకాముడైనా సరే, తీవ్రమైన భక్తితో త్రివిక్రమ భగవానునే నేమించి నియమంతో భజించాలి. నారదుడు ధ్రువునికి తాను ధ్యానించవలసిన దేవదేవుని దివ్యమంగళ రూపాన్ని ఇలా వర్ణించాడు. ‘శ్రీహరి ఆశ్రితుల యందు అపారమైన కృపారసం కురిపిస్తూ అనుగ్రహించడానికి అహర్నిశం-ఎల్లవేళలా ఆతురుడై ఉంటాడు. నగుమోము, ఎగు భుజాలు, ఎరుపెక్కిన నేత్రాలు, చల్లని చూపులు, చక్కని చెక్కిళ్లు, చక్కటి ముక్కు, ముచ్చటైన కనుబొమలతో చూడచక్కని వాడు. నీల నీరద సుందరుడు, నిత్య నూతన యవ్వనుడు. అరుణారుణ (ఎర్రని) ఓష్ఠములు-పెదవులు కల కరుణావరుణాలయుడు- దయా సముద్రుడు. చతుర్విధ పురుషార్థాలను చతురతతో ప్రసాదించు చతుర్భుజుడు. ఆపదలో చిక్కి శరణన్న వారికి ఆశ్రయం. సర్వశుభాలకు శాశ్వత నిలయం. శ్రీవత్సాంకుడు సర్వలోక రక్షకుడు. పుణ్యమూర్తి పురుషోత్తముడు సర్వసాక్షి. శ్రీహరి హార, కేయూర (భుజకీర్తులు), కిరీణ, కంకణాది భూషణాలంకృతుడు. కామిత మందారుడు. కమనీయ కాంచీ (మొలనూలు) కలాప శోభితుడు. మకర కుండల భూషితుడు.
మహనీయ కౌస్తుభ మణిప్రభలతో రమణీయ కంఠమాలికా ధరుడు. ఆనంద స్వరూపుడు. ఆశ్రితుల అంతరంగాలకు, నేత్రాలకు, శ్రోత్రా (చెవు)లకు ఆనందాన్ని అనుగ్రహించేవాడు. శంఖ, చక్ర, గదా, పద్మ హస్తుడు. జన్మ రహితుడు. జగత్తులో ప్రశస్తుడు-ప్రసిద్ధుడు. నవ్య వనమాలా విరాజితుడు. అర్భకా! ఆ శ్రీహరి హరిదాసుల అజ్ఞానాన్ని హరించేవాడు. నూతన పీతాంబర ధారి. అందమైన అపరంజి-బంగారు అందెలతో అలంకరింపబడిన పాదలు కలవాడు’ అని వివరించాడు నారదుడు. సకల సద్గుణ శోభితుడు. దర్శనీయతముడు-‘కనకన రుచిరా’ అనే పంచరత్న కీర్తనలో త్యాగయ్య అనుభవించి, అందించినట్లు ఎంత చూసినా వింత-వింతగా తనివి తీరనివాడు హరి. ‘ధ్రువకుమారా! వాసుదేవ మంత్రం ఓంకారంతో కూడింది. ద్వాదశ (12) అక్షరాలతో కూర్చబడినది. దేశకాల విభాగాలు విచారించి విబుధవరులు-విశిష్ట విద్వాంసులు అనుష్ఠించి, జపించి సంపూర్ణ అనుగ్రహం పొందిన ద్వాదశాక్షరీ మహా మంత్రం ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’. బిడ్డా! ఈ మంత్రరాజాన్ని ఏడు దినాలు జపించిన దేవతలను దర్శించే సామర్థ్యం కలుగుతుంద’ని తెలిపాడు.
సీ॥ దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము జలజంబులను జారుజలజనయనుఁదులసీ దళంబులఁ దులసికా దాముని,మాల్యంబులను సునైర్మల్య చరితు బత్రంబులను బక్షిపత్రునిఁగడు వన్య మూలంబులను నాది మూలఘనుని సంచిత భూర్జత్వగాది నిర్మిత వివి దాంబరంబులను పీతాంబరధరుఁ
తే॥ దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపముల యందుఁ గాని నిరూఢమైన సలిలముల యందుఁ గాని సుస్థలము లందు గాని పూజింపవలయు నక్కమలనాభు
‘జప్యశ్చ పరమో గుహ్యః’ మంత్రమంటేనే రహస్యం. నేను ఫలానా దేవోపాసకుడను, ఫలానా మంత్రం జపించే వాడను అంటూ చాటింపు వేసుకునేది కాదు. ‘షట్కర్ణో భిద్యతే మంత్రః’- ఉపాస్య దేవత, ఉపాసకునికి తప్ప మూడో మనిషికి తెలిస్తే మంత్రం మైలపడుతుంది, మూల్యం పోతుంది.
పరమర్షి పూజావిధానాన్ని ఇలా పరామర్శించాడు. ‘ధ్రువా! గరిక పోచల వలె నల్లనైన గరుడ వాహనుని గరిక పోచలతో పూజించాలి. పద్మనేత్రుని పద్మాలతో పూజించాలి. తులసీధామ విభూషితుని తులసీదళాలతో అర్చించాలి. నిర్మలమైన శీలంగల నీరజాక్షుని నిరంతరం పూలమాలలతో పూజించాలి. ఆ కమలాకాంతుని కోమల కిసలయాలతో- చిగురాకులతో ఆరాధించాలి. ఆ ఆదిమూలుని వనమూలికలతో భజించాలి. పచ్చని పట్టుపుట్టాలు కట్టుకునే ఆ పుట్టుక లేని పరమాత్మను చెట్ట పట్ట (బెరడు)లతో నేసిన నారబట్టలతో సేవించాలి. మాణవకోత్తమా (ఉత్తమ బాలుడా)! మాధవుని మృణ్మయ (మట్టి), శిలామయ (రాతి), దారుమయ (చెక్క), విగ్రహ రూపంలో కానీ, పావన జలాలతో కానీ, పవిత్ర స్థలాలలో కానీ పూజించాలి. శాంతుడై, దాంతుడై, ఇంద్రియ నిగ్రహం కలిగి, మితభాషియై, విహిత ఆచార సంపన్నుడై, కందమూలాలను, పత్ర ఫలాలను ఆహరిస్తూ- భుజిస్తూ, ఆనంద కందు (ఘను)డైన ఇందిరా రమణుని కల్యాణ గుణాలను డెందం (హృదయం)లో ధరించి ధ్యానించాలి’ అని ధ్రువుడికి ఉపదేశించాడు నారద మహర్షి.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006