ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసంతస్సామంతో మలయమరు దాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే! (సౌందర్యలహరి -6)
ఓ హిమగిరి సుతే! హిమవంతుని కుమార్తెవైన ఓ పార్వతీ దేవీ! మన్మథుడు ఈ సకల జగత్తుపైనా విజయం సాధిస్తున్నాడు. అతనా అనంగుడు (శరీరమే లేనివాడు). అతని దగ్గర ఉన్న సాధన సంపత్తి ఏమిటి? ధనస్సు చూద్దామా.. అది పూవులతో అలంకరించిన మృదువైన చెరకు గడ. (మనోరూపేక్షు కోదండా-లలితా సహస్రనామం) దానికి బిగించిన నారి, తుమ్మెదల వరుస… ఒక దగ్గర నిలవనివి. బాణాలా.. ఉన్నవే అయిదు (అరవిందం, అశోకం, మామిడి పువ్వు, నవమల్లిక, నీలోత్పలం). ఎవరినీ గాయపరచలేని పూవులవి. సహాయకుడా వసంతుడు. అల్పాయుష్కుడు.. రెండు నెలలే అతని ఆయువు. అతనికి మాటాలేదు, ఆలోచన లేదు. రథమా.. మలయమారుతం. ఎప్పుడొస్తుందో, ఏవైపు వెళుతుందో తెలియదు.. అసలు కదలుతుందో లేదో తెలియదు! అయినా అతనెలా మహా ఋషులను సైతం మోహింపజేసి వారిని తిరిగి సంసార చక్రంలో బంధించే కార్యంలో విజయ సాధకుడయ్యాడు? అంటే నిన్ను ఆరాధించి ఎలాగోలా కామపి (నిర్వచించలేని) నీ కృపా కటాక్షాలను పొందడం వల్ల మాత్రమే! అంటారు శంకరులు.

తాత్వికంగా చూస్తే.. మన మనస్సే మన్మథుని చేతిలోని ధనువు. సంకల్ప వికల్పాలకు కారణమైన మనస్సును జయించడం వల్ల మాత్రమే దానిని అదుపు చేయగలం. జయించడం అంటే దాన్ని గురించి సమగ్రమైన అవగాహనను పొంది, ఆ మనస్సును అమ్మకు సమర్పించడమే. ఆ ధనస్సు అనే పుష్పానికున్న అయిదు రేకులు పంచేద్రియాలుగా (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము) చెబుతారు (పంచతన్మాత్రసాయకా). పంచేద్రియాలే విషయానుభవానికి మూలాలు. ఏ ఇంద్రియంతో పనిచేస్తుంటే ఆ అనుభవాన్ని అనుభూతిని పొందేది, ఆస్వాదించేది మనస్సే కాబట్టి మనస్సు స్థానాన్ని ఇదని చెప్పలేం. ఇక బాణాలు పంచతన్మాత్రలు.. (శబ్ద రూప స్పర్శ రస గంధాలు). ప్రాపంచిక విషయానుభవాన్ని ఇంద్రియాలు మనస్సుకు చేరవేస్తాయి. ఆ విషయాలను మనసుకు చేరవేసేందుకు సాధనం నాడీమండలం. కంటికి సంబంధించిన నాడులు దృశ్యాన్ని, చెవికి సంబంధించిన నాడులు శబ్దాన్ని, రసమునకు సంబంధించిన విషయం జిహ్వా (నాలుక) నాడులు, ఘ్రాణనాడుల ద్వారా వాసనలు, చర్మానికి సంబంధించిన నాడులు స్పర్శను మనస్సుకు చేరవేస్తాయి. స్థూలంగా చెప్పుకుంటే.. శబ్దం-చెవికి, స్పర్శ-చర్మానికి, రూపం-కన్నుకు, రసం- నాలుకకు, గంధం- ముక్కుకు సంబంధించిన తన్మాత్రలుగా చెబుతారు.
మన్మథుడు ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు.. అంటే మన మనస్సును తన అధీనంలోకి తెచ్చుకున్నాడని! వింటినారిని సంధించాడంటే నాడీమండలాన్ని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు! ఒక్కొక్క బాణాన్ని వదిలే సమయంలో ఒక్కొక్క ఇంద్రియం సాధకుని స్వాధీనాన్ని తప్పి మన్మథుని వశమైపోతుంది. బలహీనమైన ఇంద్రియాలకు కోరికలు వంత పలకడం వల్ల సాధకుడు సంసారచక్ర భ్రమణంలో నిరంతరం చరిస్తూనే ఉంటాడు. దానికి మలయమారుతం ప్రేరణనిస్తుంది. మనలో చాలామంది తాము విజయ సాధకులు కాకపోవడానికి కారణాలెన్నో చెబుతుంటారు. కానీ, ఏ ఉపకరణాలు లేకున్నా మన్మథుడు భక్తితో అమ్మను అర్చించి ఆమె కృపాకటాక్షాలతో విజయుడవుతున్నాడు. భౌతిక జీవితంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా విజయసాధనకు అవసరమైనవి.. గెలవాలనే బలమైన సంకల్పం, సమర్పణ భావనతో కూడిన భక్తి, ఆచరణాత్మకమైన జ్ఞానం, దాన్ని నిర్మలమైన మనస్సుతో ఆచరించడం, చేసిన కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పించడం మాత్రమే! ఈ లక్షణాలను సంతరించుకున్న సాధకుల సాధన అమ్మ అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది.
పాలకుర్తి రామమూర్తి