ఈ సృష్టి పరమాత్మ స్వరూపం. సృష్టిలోని సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపాలే. వాటినే ఆత్మ స్వరూపులుగా భారతీయ ధర్మం గౌరవించింది. అందుకే జ్ఞాన సముపార్జనలో ఆత్మజ్ఞాన సముపార్జనే ప్రధానమని భావించింది మన ధర్మం. ఆత్మ స్వరూపాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునుడితో భగవద్గీతలోనూ చెప్పడం ఆత్మజ్ఞాన ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.
అచ్ఛేద్యోయమదాహ్యోయమ్ అక్లేద్యోశోష్య ఏవ చ
నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః॥ (భగవద్గీత 2-24)
అర్జునుడు కర్తవ్యాన్ని విస్మరించి సామాన్యుడిలా ప్రవర్తిస్తున్న సందర్భంలో అతణ్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేసే క్రమంలో మరోసారి ఆత్మతత్వాన్ని చెప్తూ.. ‘అర్జునా! ఆత్మను ఎవరూ ఖండించలేరు, దహింపలేరు, నీరు గానీ, మరేదైనా గానీ ఆత్మను తడపలేదు. ఆత్మ నిత్యమైనది. అది అంతటా వ్యాపించి ఉంటుంది. అది సుస్థిరమైనది. దానికి చలనమే లేదు. ఆత్మ అత్యంత ప్రాచీనమైనది’ అని స్పష్టం చేశాడు. దీన్నిబట్టి ఆత్మ నిత్యత్వం, సర్వవ్యాపకత్వం అవగతమవుతున్నది.
ఆత్మ శాశ్వతత్వాన్ని ప్రస్తావిస్తూ అది అస్ర్తాలకు లొంగనిది, అగ్నికి ఆహుతి కానిది, మరే ఇతర పద్ధతుల్లోనూ ఆత్మకు నాశనం లేదని చెప్తూనే, మరోసారి దాదాపుగా ఇదే విషయాన్ని అర్జునుడికి స్పష్టం చేశాడు. వెనువెంటనే ఈ విషయాన్ని బోధించడం ద్వారా ఆత్మ ప్రాధాన్యాన్ని లోకానికి తెలియపరిచాడు శ్రీకృష్ణ భగవానుడు. అగ్నికి కాల్చగలిగే శక్తి ప్రధానం. కానీ, అది ఆత్మను కాల్చలేదు. అదేవిధంగా నీళ్లకు ఏదైనా వస్తువును తడిపి నశింపజేసే శక్తి ఉండవచ్చు కానీ, అది ఆత్మను ఏమీ చేయలేదు. కాలానికి దేన్నయినా నాశనం చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ, ఆత్మను ఏ కాలశక్తీ ఏమీ చేయలేదు. అందుకే ఆత్మను నిత్యమని శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. పైగా దీన్ని సర్వవ్యాపిగా అభివర్ణించడం వల్ల ఆత్మ విస్తృతి ఎంత గొప్పదో తెలియజేశాడు. ఎవరైనా శస్త్ర, అస్ర్తాలతో నాశనం కావచ్చు. అవి పాంచ భౌతికమైన ఈ దేహాన్ని కూల్చవచ్చు. కానీ, అవి ఆత్మను తాకలేవని భగవంతుడు స్పష్టం చేశాడు.
తన శస్త్ర, అస్ర్తాల బలిమికి శత్రు పక్షంలోని గురు బాంధవులు నశిస్తారనే భావరేఖ అర్జునుడి హృదయంలో పొడచూపింది. దాని కారణంగానే ఆయన హృదయంలో నైరాశ్యం, నిస్పృహ, అకర్మణ్య భావనలు కలిగాయి. అర్జునుడి మనోస్థితిని గుర్తించిన శ్రీకృష్ణుడు ఆత్మ శాశ్వతమనే విషయాన్ని పదేపదే బోధించి, అతనిలో వైరాగ్య భావాన్ని దూరం చేశాడు. ఈ విషయం అర్జునుడికే పరిమితం కాదు. అందరికీ వర్తిస్తుంది.
మనిషి తనదైన బాధ్యతను నిబద్ధతాబద్ధుడై నిర్వహించినప్పుడు లోకం చైతన్యమయమై శాంతిప్రదంగా మారుతుంది. ఇది మరవకూడని ధర్మం. ఆత్మను బ్రహ్మ స్వరూపంలో గుర్తించింది భారతీయ సనాతన ధర్మం. సర్వజీవులనూ దైవ స్వరూపంగా గుర్తించిన కారణంగా జీవుడే దేవుడన్న భావన కూడా మన సంస్కృతిలో ప్రధానాంశంగా నిలిచింది. ఆ బ్రహ్మం మార్పు చెందనిది, దేశకాల పరిధులకు అతీతమైనదని మన శాస్ర్తాలు బోధించాయి. ఆత్మ అనే బ్రహ్మం లేని చోటు లేదని భగవద్గీత బోధించింది. ఇది శాశ్వతమైనది కాబట్టి మన మహా పురుషులు ‘ఆత్మ సత్యమ’ని బోధించారు. సార్వజనీనం, సార్వకాలికం అయిన ఈ బ్రహ్మ భావానికి భగవద్గీత ప్రధాన వేదికగా నిలిచింది. నిత్యం, సర్వగతం, స్థిరం, అచలం అయిన ‘ఆత్మే బ్రహ్మం’ అన్న విశుద్ధ జ్ఞానాన్ని లోకానికి అందించింది. ఇదే జ్ఞానాన్ని శ్రీకృష్ణుడి ద్వారా పొందిన అర్జునుడు చివరిలో తనలో మోహ లక్షణాలు నశించాయని స్పష్టంగా చెప్పగలిగాడు. సర్వమానవాళి ఈ మార్గంలో సాగి అశాశ్వతమైన భవబంధాలకు అతీతులై, తమ కర్మలను నిబద్ధతతో నిర్వహించాలని బోధిస్తున్న మహాగ్రంథం భగవద్గీత.
-గన్నమరాజు గిరిజా మనోహరబాబు