రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లపాటుగా అలా ఒకేచోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు. ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఇది కర్మల నుంచి తప్పించుకోవటం కాదా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు మహర్షి ‘ఇక్కడ కర్మ జరగటం లేదని మీరు ఎందుకనుకుంటున్నారు? తిరిగే చక్రానికి తిరగని ఇరుసే కదా ఆధారం! అలాగే నిశ్చలంగా ఉండటమూ కర్మకు ప్రేరణే’ అన్నారు. అలా కర్మలో అకర్మకు, అకర్మలో కర్మకు ఆయన అద్భుతమైన నిదర్శనంగా నిలిచారు.
అలాగే ఒకసారి కె.అరుణాచలం అనే గాంధేయవాది, రమణ మహర్షిని కలసి ‘భగవాన్! అందరినీ ఊరకే ఉండమంటారు. మీరూ ఉండి చూపిస్తారు. కానీ మహాత్మాగాంధీ అందరినీ కార్యనిమగ్నులు అవ్వాలంటారు. ఆయన కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈ తేడా?’ అని ప్రశ్నించారు. అప్పుడు అనన్య సామాన్యమైన మందహాసం రమణ మహర్షి ముఖంపై పొటమరించింది. ‘నేను ఊరకే కూర్చుంటున్నానని నీకెవరు చెప్పారు? ఆ మహాత్ముడు పనిలోనే నిమగ్నమయ్యాడని ఎందుకు అనుకుంటున్నావు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ‘కర్మలో అకర్మనూ, అకర్మలో కర్మనూ ఎవడు దర్శిస్తాడో, వాడే శ్రేష్ఠుడు, అతడే యోగి’ అన్న శ్రీకృష్ణభగవానుడి గీతామృత భావాన్ని స్ఫురింపజేశారు. కృష్ణభగవానుడు భగవద్గీతలో తరచూ ‘స్థితప్రజ్ఞత’, ‘నిశ్చలత’ అన్నవి కార్యక్షేత్రాల్లో అత్యున్నతమైన గుణాలుగా ప్రస్తావించాడు. కర్మ సన్న్యాస యోగంలో ‘ఏవరైతే తమయందే శాంతిసుఖాలను అనుభవిస్తారో, ఎవరికి తమయందే జ్ఞాన ప్రకాశం ఉదయిస్తుందో వారు అత్యున్నత స్థితికి చేరతారు’ అని బోధించాడు.
మహా భారతంలో మహా మహా యోధులందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారే. కానీ, ఒక్క కృష్ణభగవానుడు మాత్రం ఎలాంటి ఆయుధమూ పట్టలేదు. ఎదురుపడి పోరాటమూ చేయలేదు. కేవలం రథసారథిగానే ఉన్నట్లు కనిపించాడు. మహా సంగ్రామాన్ని ఓ సాక్షిలా గమనించాడు. కానీ, ఆ రణరంగమంతా ఆ రుక్మిణీ నాథుడి కనుసన్నల్లోనే ముందుకు సాగిందన్నది జగద్విదితం. అకర్మలో తీవ్ర కర్మ దాగి ఉంటుందనటానికి అంతకుమించి తార్కాణం లేదు. ఇదే విషయాన్ని బర్బరీకుడి వృత్తాంతం తెలియజేస్తుంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో దేశంలోని రాజులందరూ కౌరవ, పాండవ పక్షాలలో చేరారు.
యోధాను యోధుడైన బర్బరీకుడు కూడా కురుక్షేత్రం చేరుకుంటాడు. ఏ పక్షం బలహీనంగా ఉంటే అందులో చేరుతానంటాడు బర్బరీకుడు. యుద్ధంలో బలాబలాలు మారుతూ ఉంటాయి. బర్బరీకుడు ఎవరి పక్షం వహించినా యుద్ధం ఫలితం తేలదు. కాబట్టి, శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఇవ్వమని కోరుతాడు. అయితే మొండెం నుంచి వేరైన తన తల కురుక్షేత్ర యుద్ధాన్ని చూసేలా వరం కోరుతాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు సరేనంటాడు. అలా బర్బరీకుడి శిరస్సు కురుపాండవ సంగ్రామం అంతా వీక్షిస్తుంది. యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు బర్బరీకుడి శిరస్సుతో ‘యుద్ధం చూశావా?’ అని అడుగుతాడు. అప్పుడు బర్బరీకుడు ‘దేవా! యుద్ధం జరిగినన్ని రోజులూ కురుక్షేత్రంపై గిరగిరా తిరిగిన నీ సుదర్శన చక్రం తప్ప నాకు మరేమీ కనిపించలేదు’ అంటాడు. ఏం చేయకున్నా.. అంతా శ్రీకృష్ణుడే చేశాడనటానికి నిదర్శనమిది.
బాగా తిప్పి వదిలేసిన బొంగరం ఉన్నచోటే తిరుగుతూ ఉంటుంది. దూరం నుంచి చూసినవారికి అది అలా కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, తీవ్రమైన భ్రమణం దానిలో దాగి ఉన్నది. అలాగే ఉత్కృష్టమైన సంకల్పాలకు సాకారంగా నిలిచేవారు కూడా బాహ్య ప్రపంచానికి ముభావంగా కనిపించవచ్చు. కానీ, వారిలో తీవ్ర కర్మపరాయణత్వం దాగి ఉంటుంది. నిశ్చలత, స్తబ్దత బాహ్యానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ, నిశ్చలత నిలకడగా పారే సెలయేరు లాంటిది. స్తబ్దత కాలుష్యపు కాసారం లాంటిది. నిశ్చలత, మౌనం మనిషిలోని చైతన్యశక్తిని జాగృతం చేస్తాయి. మన ఏకాంతం మనల్ని నిశ్చలంగా మార్చాలి. స్తబ్దతలోకి కుంగదీయకూడదని మాధవుడి మొదలుకొని మహర్షి వరకు చెప్పింది ఈ సూత్రమే!
-మనోజ్ఞ