TTD news | ఈ నెల 27 నుంచి ఐదు రోజులపాటు విశాఖలో చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. విశాఖపట్నం పెందుర్తిలో ఉన్న శ్రీశారదా పీఠంలో చతుర్వేద హవనం చేపడుతున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో లోక కల్యాణం కోసం చతుర్వేద హవనం నిర్వహిస్తారు.
ఈ హవనం కార్యక్రమంలో 32 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొంటారు. జనవరి 31న పూర్ణాహుతితో చతుర్వేద హవనం ముగియనున్నది. ఈ హవనంలో పాల్గొనే భక్తులకు సుఖశాంతులు, ధనధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయని పండితులు తెలిపారు. విశాఖ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర మహాస్వామిని కలిసి టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం చతుర్వేద హవనం ఏర్పాట్లను పరిశీలించారు. యజ్ఞ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, భక్తుల కోసం చేపడుతున్న ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.