దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగ భయక్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే!
(భగవద్గీత – 2-56)
స్థితప్రజ్ఞుడి లక్షణాలను గురించి ప్రశ్నించిన అర్జునునితో.. కృష్ణ పరమాత్మ.. ‘దుఃఖాలకు కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయక్రోధాలను వీడినవాడు అయిన మననశీలుడు.. స్థితప్రజ్ఞుడిగా చెప్పబడుతాడు’ అంటాడు. ఏ వ్యక్తీ కేవలం పుట్టడం.. బతకడం.. మరణించడం కోసం ఈ భూమిపైకి రాలేదు. అనంతమైన శక్తిసామర్థ్యాలతో, ఉన్నతమైన దార్శనికతతో, విస్తారమైన ఆలోచనలతో, ఉదాత్తమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు జన్మించాడు. ప్రతివ్యక్తీ తన ఆశయాలను సాకారం చేసుకుంటూ, తనదంటూ ప్రత్యేకతను చాటుకునేందుకు భూమిపైకి వచ్చాడు. ప్రపంచాన్ని సుసంపన్నం చేయడం, తన జీవితాన్ని ఉన్నతీకరించుకోవడం లక్ష్యంగా వ్యక్తి సాధన సాగాలి. ఆ లక్ష్యాన్ని విస్మరించిన వ్యక్తి మనసు బలహీనతకు ఆవాసమైనట్టుగానే భావించాలి. ఆ లక్ష్యాన్ని గుర్తించిన వ్యక్తి నాయకుడిగా భావితరాలకు మార్గదర్శకుడై నిలుస్తాడు.
సత్యమనేది ఒక్కటే.. చూసే దృష్టి కోణాలలో భేదం ఉంటుంది. నా దృష్టే అంతిమం అనుకుంటే వివాదాలు తలెత్తుతాయి. ఎదుటివారి కోణాన్నీ అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. అది సంవాదమై.. ఇరువురి అవగాహనను ఉన్నతీకరిస్తుంది. నాయకుడిలో ఆ సంయమనం ఉండాలి. ఉత్తమ నాయకుడైన కృష్ణుడు… అర్జునుడి దృష్టిపరిధిని పెంచే క్రమంలో చేసిన బోధ, పరివర్తన చెందాలనుకునే ఈనాటి నాయకులకు దారిచూపుతుంది.
సంస్థలో నాయకుడు స్థితప్రజ్ఞత సాధిస్తేనే ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాడు. స్వీయ నియంత్రణ, మానసిక సమతుల్యత, అంతర్గత శక్తిసామర్థ్యాల వినియోగం, భావోద్వేగాలకు అతీతంగా స్థిరమైన మానసిక చైతన్యాన్ని పెంపొందించుకునే నాయకుడు ఎన్ని ఒడుదొడుకులు, ఒత్తిడులు ఎదురైనా కలతపడకుండా లక్ష్యాలను అధిగమించేందుకు ముందుకు సాగుతాడు. నిజానికి సంతోషం దుఃఖం రెండూ సాపేక్షాలే. అవి నాణానికి రెండు ముఖాలు. మనం ఒక ముఖాన్ని చూస్తున్నామంటే మరొక ముఖం పలకరించడానికి వేచి ఉన్నట్లే కదా! ఆంతరంగిక బలాబలాలను గుర్తించి.. వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల ప్రశాంతతను సంతరించుకుంటాం. ప్రశాంతత వల్ల ఫలితాలపై కాకుండా ప్రక్రియపై దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుంది. ఆత్మ నిగ్రహం, స్పష్టత, నిర్భయత, తప్పులను గుర్తించి సరి చేసుకోవడం, క్షమా గుణం, దృఢ సంకల్పం, నిరాడంబరత లాంటి లక్షణాలు అలవడుతాయి. స్వీయ అవగాహనను పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావానికి లొంగిపోవడం జరగదు. అంతర్ దృష్టి అలవడడం వల్ల దార్శనికత పెరుగుతుంది.
నాయకత్వం ఎప్పుడూ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కాదు, ప్రయోజన రహితంగా మాట్లాడటమూ, వల్లించడమూ కాదు. ఎక్కువమంది స్నేహితులను సంపాదించడమో లేదా చుట్టూ ఉన్న జనాలను ప్రభావితం చేయడమో, ముఖస్తుతులకు పొంగిపోవడమో, ముఖస్తుతులను చేయడమో నాయకత్వం కాదు. నాయకత్వం అంటే అనుచరుల దృష్టికోణాన్ని ఉన్నతీకరించడం. వారి ఆలోచనా పరిధిని విస్తరింపచేయడం. వారి పనితీరును, సామర్ధ్యాన్ని ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం. అనుచరులు తమ సాధారణ స్థాయి సామర్థ్యాన్ని అసాధారణ స్థాయికి పెంచుకునేందుకు అవసరమైన ఉత్ప్రేరకంగా పనిచేయడం! సకారాత్మకమైన వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకునే వాతావరణాన్ని కల్పించడం.
ప్రతిభావంతుడైన నాయకుడు ఒంటరిగా నిలవగలిగిన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు. అవసరమైన సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలనైనా తీసుకునే ధైర్యం అతని సొంతం. అంతేకాదు, సహానుభూతితో ఎదుటివారి కష్టసుఖాలకు స్పందించడం, ప్రేమాభిమానాలతో, అవసరమైన సహకారాన్ని అందించడం నాయకుడి లక్షణంగా ఉంటుంది. తాను నాయకుడనని చెప్పుకోవడం నాయకత్వ లక్షణంకాదు. నాయకుడి సమర్థత.. ఆతని చర్యల ద్వారా సమగ్రతను, సమానతను సంతరించుకొని.. అందరినీ ఒక్కతాటిపై నడపడంలో వెల్లడవుతుంది. నిజానికి మార్గం తెలిసినవాడే నిజమైన నాయకుడు! తాను ఆ మార్గంలో గమిస్తాడు, అనుచరులకు మార్గం చూపుతాడు. అలాంటి దృక్పథాన్ని సంతరించుకుంటే స్థితప్రజ్ఞత అలవడుతుంది. దానితో నాయకత్వం తనంతట తానే వరించి వస్తుంది.
– పాలకుర్తి రామమూర్తి