తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) చివరి రోజు బుధవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఉదయం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం (Snapana Thirumanjanam ) నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు చక్రస్నానాన్ని మంత్రోచ్ఛరణల మధ్య కొనసాగించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈరోజు రాత్రి 7 నుంచి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.