ఓ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికీ సత్సంగం జరుగుతుంది. ఒక కంటి అద్దాల వ్యాపారి క్రమం తప్పకుండా ఆశ్రమానికి వెళ్తుండేవాడు. సత్సంగం పూర్తయ్యాక, అక్కడ ఉండే పుస్తకాల అంగడి ముందు చాలాసేపు నిలబడే వాడు. చివరిగా తనకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని బేరమాడకుండా కొనేవాడు. ఆ పుస్తకాల అంగడి యజమాని ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు. ఆశ్రమానికి వచ్చిన ప్రతిసారీ అద్దాల వ్యాపారి పుస్తకాలు కొనడాన్ని అతను ఆసక్తిగా గమనించేవాడు. ఒక పౌర్ణమి రోజు సాయంత్రం అద్దాల వ్యాపారితో ‘మీరు మంచి చదువరిలా ఉన్నారు. అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా పుస్తకాలు కొంటూ ఉంటారు. ఏ నెల కొన్న పుస్తకాలు ఆ నెల చదివేస్తారా?’ అని అడిగాడు అంగడి యజమాని. ‘నేను పుస్తకాలు చదువుతానని మీకు ఎవరు చెప్పారు? నేను పుస్తకాలను కొంటానే కానీ చదవను’ అని బదులిచ్చాడు అద్దాల వ్యాపారి. అందుకు అంగడి యజమాని ‘ఎందుకలా చేస్తారు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు. ‘పుస్తకాలు కొంటే మంచిదని నా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు.
అందుకని కొంటున్నాను’ అని సమాధానమిచ్చాడు అద్దాల వ్యాపారి. చిన్నగా నవ్విన అంగడి యజమాని ‘పుస్తకాలు కొంటే ఏదో ఒకరోజు చదువుతారని మీ నాన్న అలా చెప్పి ఉంటాడు. పుస్తకాలను కొని ఇంట్లో పెట్టుకుంటే ఏమి లాభం? పుస్తకాలు కొనడం మంచిదని తెలిసిన మీకు, వాటిని చదవడం కూడా మంచిదని తెలిసే ఉండాలి. మనం అనేక మంచి విషయాలను వింటాం, తెలుసుకుంటాం. అయితే ఆచరించడానికి వెనుకాడుతాం. కార్యాచరణలో పెట్టడానికి వాయిదాలు వేస్తాం. పుస్తకాలను కొని అలంకరణగా ఇంట్లో పెట్టుకుంటే ఏమి ఉపయోగం? ఇకనైనా చదవడం ప్రారంభించండి’ అని సలహా ఇచ్చాడు. ‘నిజమే.. కళ్లు ఉంటేనే కదా, కళ్లజోడు ఉపయోగం. కళ్లే లేకుంటే ఎంత ఖరీదైన కళ్లజోడు అయినా నిరుపయోగమే కదా. కాబట్టి కొన్న పుస్తకాలన్నిటినీ చదవడం ప్రారంభిద్దాం’ అని మనసులో నిశ్చయించుకొని అక్కడినుంచి కదిలాడు కళ్లజోళ్ల వ్యాపారి.