శ్రద్ధావాననుసూయశ్ఛ శృణుయాదపి యో నరః
సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్
(భగవద్గీత 18-71)
‘శ్రద్ధ, విశ్వాసాలు గలవారు, అసూయలేని వారు.. గీతా జ్ఞానాన్ని కేవలం విన్నాగాని, వారు పాపవిముక్తులై, పుణ్యకర్మలను ఆచరించువారు చేరే ఉత్తమ లోకాన్ని చేరుతారు’ అని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ వ్యక్తి అయితే సత్యసంధుడై, నియమ నిష్ఠలతో, నైతిక వర్తనతో జీవిస్తాడో అతను చేసే కర్మలు పుణ్యకర్మలుగా భాసిల్లుతాయి. భగవద్గీతను విన్నా కూడా ఆ ఫలితం వస్తుందని శ్రీకృష్ణుడి మాట! పలుమార్లు ఒకే విషయాన్ని వినడం వల్ల దానిపై ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వల్ల మరింత లోతుగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏర్పడుతుంది. జిజ్ఞాస వల్ల ఆచరణపై దృష్టిపడుతుంది. ఆచరణ ఫలితాన్ని ఇస్తుంది. ఫలితం ప్రేరణనిస్తుంది.
కృష్ణుడు గీతాబోధ చేస్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. తనకు వచ్చిన అనుమానాలు అడుగుతున్నాడు. గీతాచార్యుడు ఆ అనుమానాలకు ఓపికగా సమాధానాలు ఇస్తున్నాడు. కృష్ణుడి బోధపట్ల అర్జునుడికి శ్రద్ధ, ఆదరణ, విశ్వాసాలు ఉన్నాయి. గీతాజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునే బుద్ధి కుశలతా ఉన్నది. అయితే గీతను అవగాహన చేసుకోదగిన బుద్ధి కుశలత లేనివారి సంగతేమిటి? కృష్ణుడే ఆ ప్రశ్నను వేసుకొని, శ్రద్ధావిశ్వాసాలతో గీతను విన్నా వారికి ఆ ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. ఎందుకంటే.. శ్రద్ధ కలిగిన జిజ్ఞాసువుల అంతరంగంలో అంతర్యామిగా ఉన్న భగవంతుడే వారి నిష్కపటమైన తపనను, ప్రయత్నాన్ని గమనించి వారికి ఆ ఫలితాన్నిస్తాడు.
ఒక కార్యాన్ని నిర్వహించాలి అంటే.. ఆ కార్య స్వరూప, స్వభావాలు తెలియాలి. ఆ కార్యంపై ఆదరణ ఉండాలి. ఎందుకు నిర్వహించాలో స్పష్టత కావాలి. పరిణామాల పట్ల అవగాహన కలగాలి. నిర్వహించాలనే ఆసక్తి ఉండాలి. చేయగలననే విశ్వాసం ఉండాలి. నిబద్ధతతో నిష్పాక్షికమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దానిని సాకారం చేయగలిగిన నైపుణ్యాలను సంతరించుకోవాలి. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే వైఖరి కలిగి ఉండాలి. ఫలితంపై కాకుండా ప్రక్రియ ఆధారంగా క్రమశిక్షణతో కార్యక్షేత్రంలో పరిశ్రమించాలి. పూర్వ నిశ్చితాభిప్రాయాలకు అతీతమైన మనోవికాసంతో శ్రద్ధతో ముందుకు సాగాలి. ఎదురయ్యే జయాపజయాలను సమంగా స్వీకరించాలి. అప్పుడే భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలలో సాధకుడు లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు.
కార్యసాధనలో నమ్మకమనేది అత్యంత ప్రముఖమైనది. కార్యాన్ని ఆరంభించడానికి తనపై తనకు నమ్మకం ఉండాలి. కార్యాన్ని చివరిదాకా తీసుకు వెళ్లేందుకు పరమాత్మను విశ్వసించాలి. ఫలితాపేక్ష సహా మనసును పక్కదారి పట్టించే అన్ని దారులను మూసివేసి, కార్య నిర్వహణపై మాత్రమే దృష్టిపెట్టాలి. కార్యనిర్వహణలో ఒత్తిడులు, భ్రమలు తొలిగిపోవాలంటే ప్రక్రియను ఆదరించాలే కానీ ఫలితాలకు బందీకాకూడదు. ఫలితాపేక్ష లేని కర్తవ్య నిర్వహణే ముక్తి.
ఫలితాపేక్ష లేకుండా కార్యాన్ని నిర్వహించమంటే.. ఫలితాన్ని సాధించవద్దని కాదు. దానికి బందీకావొద్దని మాత్రమే. నాయకుడు ఎప్పుడూ బంధుత్వానికి, ఫలితానికి మధ్య వారధిగా ఉండాలే కాని.. ఒకరు నావారు.. మరొకరు పరవారనే భావనను దరి చేరనీయకూడదు. భౌతిక జీవితంలో ఫలితం లేని పని చేయడం వల్ల జీవయాత్రా నడవదు.. ప్రయోజనమూ ఉండదు. సరైన పనిని సరైన విధానంలో, శక్తియుక్తులను పూర్తిగా వినియోగించి, నిర్వహించినా.. ఫలితం తారుమారైతే దానికై చింతించవద్దని మాత్రమే, కృష్ణుడి బోధ. ఎవరి శక్తియుక్తులు ఎంతటివో తెలుసుకోని వారికి తగిన విద్యలను బోధించాలి, బాధ్యతలను అందించాలి. అర్జునుడి వైఖరి, నైపుణ్యాలు, విజ్ఞానం, వివేచనలు తెలిసిన కృష్టుడు అతనికి గీతాబోధను చేశాడు. ఏది యుక్తమో ఏది కాదో తెలిసి నిర్ణయం తీసుకోమన్నాడు.
…?పాలకుర్తి రామమూర్తి