ఫలితాపేక్ష నుంచి కర్తవ్యయోగానికి..
కోరికలతో దేవతలను ఆరాధించే వారిని సకామభక్తులుగా చెబుతారు. వీరిని ‘అల్పమేధసామ్' అంటే అల్పబుద్ధులు అంటున్నది భగవద్గీత. పరమసత్యాన్ని విడిచి తాత్కాలిక ఫలితాలకే పరిమితమయ్యే దృష్టిగల వారు ‘అల్పచేతస్కులు’. వారికి అశాశ్వతమైన తదనుబంధ ఫలితాలే లభిస్తాయి. వారు ఏ దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలను మాత్రమే చేరుతారు.
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి॥
(భగవద్గీత 7-23)
కోరికలతో దేవతలను ఆరాధించే వారిని సకామభక్తులుగా చెబుతారు. వీరిని ‘అల్పమేధసామ్’ అంటే అల్పబుద్ధులు అంటున్నది భగవద్గీత. పరమసత్యాన్ని విడిచి తాత్కాలిక ఫలితాలకే పరిమితమయ్యే దృష్టిగల వారు ‘అల్పచేతస్కులు’. వారికి అశాశ్వతమైన తదనుబంధ ఫలితాలే లభిస్తాయి. వారు ఏ దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలను మాత్రమే చేరుతారు. నా భక్తులు అనగా భగవద్భక్తులు మాత్రం భగవంతుని ఎలా ఉపాసించినా భగవంతుడిని చేరుకుంటారు, అంటున్నాడు భగవంతుడు.
భ్రమరకీట న్యాయం’ ప్రకారం దేనిని గూర్చి చింతన చేస్తే దానిని పొందగలం. భౌతిక జీవన సౌకర్యాలను, భోగ భాగ్యాలను వాంఛించే వారికి దానికి అతీతమైన మోక్ష సాధన లభించదు. ప్రతి జీవి కర్మఫలాన్ని అనుభవించడాని కోసం అపరిమితమైన అవ్యక్తం నుంచి పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడం పుట్టుక. కాగా, కర్మఫలాన్ని అనుభవించాక జీవన పరిమితులను అధిగమించి అవ్యక్తంలో లయం కావడమే మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవచైతన్యం తన లక్ష్య నిర్దేశన, సాధన కోసం పరితపిస్తుంది. ఆ తపనే వారి గమ్యాన్ని గమనాన్ని నిర్ణయిస్తుంది.
‘యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్తుతః’, అంటుంది దేవీ సప్తశతి. దేన్నైనా సాధించాలి అంటే కావలసింది శ్రద్ధ. శ్రద్ధతో దేనిని ఉపాసిస్తే సాధకులకు అదే లభిస్తుంది. ఫలితం లభించగానే వారికి దానిపై శ్రద్ధ మరొక దానిపైకి వెళుతుంది. ఉద్యోగ సాధనకై శ్రద్ధ పెడితే.. ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగం వచ్చాక ఆ శ్రద్ధ వచ్చే జీతభత్యాలపైకి మారుతుందే కానీ, శ్రద్ధగా కర్తవ్య నిర్వహణపై నిలవదు. దరిద్రుడు ధనవంతుడు కావాలనుకొని శ్రద్ధతో పనిచేస్తే ధనవంతుడౌతాడు.. తదుపరి వాని శ్రద్ధ, సంపదతో మాత్రమే స్నేహం చేస్తుంది కాని దాతృత్వంపై నిలవదు. లక్ష్యం పరిమితమైన సమయంలో అమరిన కొద్దిపాటి శ్రద్ధాసక్తులు పరిమితమైన ఫలితాన్ని ఇస్తాయి.. అయితే సాధించాల్సిన లక్ష్యం అపరిమితం అయినప్పుడు చెక్కుచెదరని, అపరిమితమైన శ్రద్ధాసక్తులు అవసరం అవుతాయి.
లక్ష్యం చిన్నదైతే ఫలితమూ చిన్నదవుతుంది. ఒకడు ఓడిపోకుండా ఉండేందుకు యుద్ధం చేస్తాడు.. మరొకడు గెలిచేందుకు యుద్ధం చేస్తాడు. ఓడకుండా ఉండేందుకు చేసే యుద్ధంలో మనసు ఎక్కువగా భయంపై ఆధారపడి ఉంటుంది. నేను గెలవాలనే భావన ప్రేరణాత్మకంగా నడిపిస్తుంది. అయితే ఇది కూడా పరిమిత లక్ష్యమే, కానీ మొదటి దానికన్నా బలమైనది. నిజానికి నేను గెలవాలా, ఓడిపోవాలా అన్నది కాదు, గీత చెప్పేది నేను ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానా లేదా అనేది నిర్ణయించుకోవాలని మాత్రమే. పరిమిత ఫలితాన్ని ఆశ్రయిస్తే పరిమిత ఫలితం మాత్రమే లభిస్తుంది. కర్తవ్య నిష్ఠతో చేస్తే అపరిమిత అనుభూతిని ఆస్వాదిస్తాం.
ఒక విద్యార్థి ఉత్తీర్ణుడనైతే చాలు అనుకుంటే అది పరిమిత దృష్టి. దాని ఆధారంగానే అతని చదువు ఉంటుంది. అతని శ్రద్ధ సాధించాల్సిన మార్కులపై మాత్రమే నిలుస్తుంది. వారు నేర్చుకునే విజ్ఞానం పరిమితంగానే ఉంటుంది. ఫలితం కూడా పరిమితంగానే ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, నైపుణ్యం సంపాదించాలి, అనే దృష్టితో చదువుతారు. వారు లోతుగా నేర్చుకుంటారు. ఆ జ్ఞానం వారిలో శాశ్వతమై నిలుస్తుంది. ఇది వారికి ఉద్యోగ జీవితంలోనూ, భౌతిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ ఉపయోగపడుతుంది. దీనినే అపరిమిత ఫలితానికి దారిచూపే శ్రద్ధగా చూడవచ్చు. శ్రద్ధ ఎంతగా ఉంటే అదే నిష్పత్తిలో సాధన ఆవిష్కృతమవుతుంది.
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః, అంటుంది ఈశావాస్యోపనిషత్తు. మనిషి ఈ లోకంలో వందేళ్లు జీవించాలని కోరుకుంటే, కర్మలను చేస్తూనే ఉండాలి, కానీ వాటికి అతుక్కోకూడదు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునితో భోగాలు, సంపద, దీర్ఘజీవితం ఇస్తానంటాడు.. కాని నచికేతుడు మాత్రం.. ఆత్మజ్ఞానం కావాలంటాడు. ఆత్మజ్ఞానాన్నే శ్రేయస్సు అంటారు. అది శాశ్వతమైనది. భౌతిక సంపదలను ప్రేయస్సు అంటారు.. అతి తాత్కాలికం. దేవతలు ప్రేయస్సును ఇస్తారు.. భగవంతుడు శ్రేయస్సును ఇస్తాడు. ‘ఎవడెట్లు ప్రయత్నించునో అతడట్టి కర్మనే పొందుతాడు’ అంటుంది యోగ వాసిష్ఠం.
-పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

