అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా॥
(భగవద్గీత 2 -28)
‘ఓ అర్జునా! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్యాలు (ఇంద్రియ గోచరములు కానివి).. మరణానంతరం కూడా అవ్యక్తాలే. జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ప్రకటితం అవుతున్నాయి. అలాంటి స్థితిలో వాటికోసం పరితపించడం నిష్ప్రయోజనం’.. అంటున్నాడు కృష్ణపరమాత్మ.
వ్యక్తుల మధ్య బాంధవ్యాలు సహా ప్రతిదీ ఈ సృష్టిలో క్షణికమైనదే. ఎంత గొప్ప అనుబంధమైనా మరణంతో చెల్లిపోతుంది. కాబట్టి క్షణికమైన భౌతిక జీవనంపై ఉదాసీన భావనను కలిగి శాశ్వతమైన ఆత్మోన్నతికై పరిశ్రమించడం ఉత్తమమని పరమాత్మ చెబుతున్నాడు.
భౌతిక జీవనానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రేయస్సుగానూ, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్సుగానూ చెబుతారు. ప్రేయస్సు బంధనాలకు కారణమవుతుంది. ఆత్మోద్ధరణ కోసం ఉద్యమిస్తే బంధనాలు విడిపోతాయి. శ్రేయస్సు సమకూరుతుంది. అలాగని ఏ ఒక్కటీ జీవితానికి సమగ్రతను చేకూర్చదు. రెండిటినీ సమన్వయం చేసుకోవడం ఉత్తమ జీవన విధానం. చైతన్యశీలత నిరంతర ప్రస్థానానికి ప్రతీక. చైతన్య శీలి అయిన వ్యక్తి ఊపిరులు ఉన్నంత వరకు ఏదైనా సాధించాలనే తపనతో జీవించాలి. ప్రతీ జీవి పుడుతుంది, మరణిస్తుంది. ప్రాకృతిక నియమం ప్రకారం ఆకృతి తీసుకున్న ప్రతిదీ ఆకారాన్ని కోల్పోవాల్సిందే! వ్యక్తి ప్రస్థానం ‘అవ్యక్తం నుంచి అవ్యక్తం’లోకి చేరుకోవడమే. అవ్యక్తమైన అపరిమితత్వం నుంచి అపరిమితత్వానికి సాగే ప్రయాణంలో కర్మానుభవాన్ని పొందడం కోసం పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడం పుట్టుక. కాగా, భౌతిక జీవన పరిమితులను అధిగమించి అపరిమితత్వంలో లయం కావడం మరణం. గమ్యం గమనం నిర్ణయమయ్యాక జరిగేది పుట్టుక. గమ్యం చేరాక కలిగేది మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవచైతన్యం తన లక్ష్యం కోసం పరితపిస్తుంది. మరణం గురించిన అవగాహనను పొందడమే మరణాన్ని జయించడం.
ఏ కార్య సాధన అయినా మూడు ముఖ్యమైన మార్గాల గుండా ప్రయాణిస్తుంది. ఆరంభించడం, నిర్వహించడం, పూర్తిచేయడం.. ఈ మూడింటికీ ఆత్మలాంటిది సంకల్పించడం. ఆరంభించడానికి ముందు కార్య స్వరూపం లేదు. పూర్తి చేసిన పిమ్మట కార్యం స్వరూపాన్ని కోల్పోతుంది. కార్య నిర్వహణలోనే కార్యానికి స్వరూపం ఉంటుంది. దానిపై మాత్రమే దృష్టి పెట్టాలనేది కృష్ణపరమాత్మ ప్రబోధ. ప్రక్రియపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించి తుది ఫలితాల పట్ల నిర్లిప్తంగా ఉండడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పనిపై దృష్టి నిలుస్తుంది. ఒత్తిడిలేని పని విధానం సంస్కృతిగా మారుతుంది. అలాగని ఉన్నత ఆశయాలు ఉండకూడదని కాదు.. మార్గమేదైనా ఫలితాలను సాధించాలనే భావనకు బంధీలు కావద్దనేదే కృష్ణుని ఉద్దేశం.
కార్య నిర్వహణలో నిరంతరం మార్పులు అవసరమవుతాయి. అనివార్యమైన మార్పులను గుర్తించడం, అంగీకరించడం, ఆహ్వానించడం ద్వారా సానుకూల వైఖరిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కార్య నిర్వహణలో ఊహించని అడ్డంకులు ఎదురుపడవచ్చు.. వాటిని సవాళ్లుగా భావించి, స్వీకరిస్తూ సాగిపోవాలి. ఆ సవాళ్లనూ అధిగమించే మానసిక చైతన్యాన్ని, వికాసాన్ని సంతరించుకునే విధంగా అనుచర బృందాలనూ ప్రోత్సహించాలి. అప్పుడు వారిలో సమర్ధత ఆవిష్కృతమై నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రభావవంతమైన ఫలితాలు వాటికవే ప్రకటితమవుతాయి.
ఫలితాలు అనూహ్యమైనవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కారణాలతో సంబంధం లేకుండా ఒకప్పుడు ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు రావచ్చు. మరొకప్పుడు నిరాశాజనకమైన ఫలితాలూ ఎదురు కావచ్చు. గతకాలపు అపజయాలపై లేదా భవిష్యత్తులో ఎదురవ్వబోయే సవాళ్లపై మాత్రమే దృష్టి నిలిపితే వర్తమాన కార్యం భంగమవుతుంది. అలాకాక ప్రస్తుత పనిపై దృష్టి పెట్టడానికి బృందాలను ప్రోత్సహిస్తే.. ఉత్తమ ఫలితాలు అయాచితంగానే ఆవిష్కృతమవుతాయి. మారుతున్న ప్రపంచంలో ఆశించిన ఫలితాలు తాత్కాలికమే. భవిష్యత్తుపై భ్రమలు, గతకాలంపై అనవసరమైన భయాలు వర్తమానాన్ని దుర్భరం చేస్తాయని గుర్తుంచుకోవాలి!