సర్వ భూతస్థమాత్మానాం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః!
(భగవద్గీత – 6-29)
నిజమైన యోగులు, అంతర్బుద్ధితో భగవంతుడిని దర్శించి అతని యందే ఏకత్వాన్ని పొంది, సమత్వ దృష్టితో సర్వ భూతాలనూ భగవంతుడిలో, భగవంతుడిని సర్వభూతాల్లోనూ దర్శిస్తారు. సమదర్శన (సమవర్తన కాదు) అలవడుతుంది. దీపానికి మసి ఎలాంటిదో మనసునకు ఆలోచనలు అలాంటివే. ఆలోచనల జన్మస్థానాన్ని గమనించి, చెడు ఆలోచనలను అక్కడే నియంత్రించి, ప్రశాంతస్థితిని పొందిన వాని ఆలోచనలలో మసిలాంటి చెడు భావనలు పొడచూపవు. యోగయుక్తులైన వారి మనసులలో మైత్రి, కరుణ, సంతోషం, ఉపేక్షలు వెలుగు చూస్తాయి. మైత్రి అంటే సకల జీవుల పట్ల స్నేహభావన, ప్రేమ, దయను చూపడం. కరుణ అంటే ఇతరుల బాధలకు స్పందించి, వాటిని తగ్గించడానికి ప్రయత్నించడం. సంతోషం అంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం. ఉపేక్ష అంటే సుఖదుఃఖాలు, మంచి చెడులు, లాభనష్టాలు లాంటి భౌతిక విషయాలపై సమతుల్యతను కలిగి ఉండి, వాటిపై మమకారం లేకుండా ఉండగలగడం. ఫలితంగా మనసు ప్రశాంతమై సమత్వాన్ని పొందుతుంది. సమదర్శన సాధ్యపడుతుంది.
యోగ సాధనలో మనసుకు సున్నితత్వం, సహానుభూతి (empathy) అలవడుతుంది. వ్యక్తిగత ఎదుగుదల, సమాజంతో సత్సంబంధాలు ఏర్పడటానికి వ్యక్తిలో సున్నితత్వం, సహానుభూతులు అవసరం. భావోద్వేగాలను అదుపు చేసుకోవడం, సమాజాన్ని అవగాహన చేసుకోవడం సున్నితత్వం. దీని కారణంగా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెపుతూ, ప్రవర్తనను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇతర జీవుల కష్టసుఖాలలో, భయాలలో, వారి జీవన పరిధులలో అనుబంధాన్ని పెంచుకుంటాం, ఆత్మీయతను పంచుకుంటాం. తద్వారా ప్రపంచంతో పటిష్ఠమైన అనుబంధాలు ఏర్పడుతాయి.
ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, ఇతరులతో ఆత్మీయతను పంచుకోవడం, పెంచుకోవడమే సహానుభూతి. దీనివల్ల సకల జీవులను ఒకటిగా కలిపే మానవత్వమనే బంధం పరిమళిస్తుంది, సమాజంతో సంబంధాలు పెరుగుతాయి. సున్నితత్వం, సహానుభూతిని అలవరుచుకోవడం వల్ల వ్యక్తి మానసిక సమత్వాన్ని సాధిస్తాడు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను అధిగమించే సన్నద్ధత అలవడుతుంది. దయ, కరుణ, మైత్రి లాంటి ఉత్తమ గుణాలు వెలుగుచూస్తాయి. స్వీయ అవగాహన పెరుగుతుంది. ఆత్మ నిగ్రహణ అలవడుతుంది. వ్యక్తిగత బలాబలాలు, అంచనాలు అవగతం అవుతాయి. ఆధ్యాత్మిక భౌతిక జీవితాలను సమన్వయం చేసుకునే అంతర్గత సామర్థ్యం జాగృతమవుతుంది.
వ్యక్తిలో సున్నితత్వం, సహానుభూతి నెలకొనడం వల్ల సహకార మనస్తత్వం వెలుగుచూస్తూ.. భౌతిక జీవిత వ్యవహారాలలో, ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, తద్వారా సమస్యలను పరిష్కరించడానికి, అభిప్రాయ భేదాలను, వివాదాలను నివారించడానికి సులువవుతుంది. సున్నితత్వం, సహానుభూతుల వల్ల వ్యక్తిగత భావోద్వేగాలను నిర్వహించుకోవడం, ఒత్తిడిని అధిగమించడం సాధ్యమవుతుంది. సహానుభూతి అనేది మానవ జీవ లక్షణం. మనచుట్టూ ఉండే ప్రపంచంతో సత్సంబంధాలను ఏర్పరుచుకొని వాటిని దీర్ఘకాలం కొనసాగించే ప్రయత్నం చేయడం సహానుభూతితో మాత్రమే సాధ్యపడుతుంది. అంతర్గతంగా సుప్తావస్థలో ఉండే సహానుభూతిని జాగృతం చేసుకొని దానిని ప్రభావవంతంగా వాడుకోవడం జీవన నైపుణ్యంగా చెప్పుకోవాలి. తనపట్ల తనకు స్పష్టమైన అవగాహన, ఇతరుల పట్ల ప్రేమ, ఆంతరంగికమైన భావోద్వేగాలను సరిగా వ్యక్తీకరించడం వల్ల ఏ రంగంలోనైనా ఉత్తమమైన సహానుభూతిని పంచుకోగలుగుతాం. సమాజంతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యపడుతుంది.
జీవన నైపుణ్యాలుగా చెప్పే సున్నితత్వం, సహానుభూతుల వల్ల భౌతిక జీవితంలో ప్రేయస్సు (ప్రగతి), ఆధ్యాత్మిక జీవితంలో సుగతి (శ్రేయస్సు) కలుగుతుంది. ప్రకృతికి మనమేదిస్తే అదే మనకు లభిస్తుంది. మంచిని పంచుదాం.. శుభాలను పొందుదాం.