దైవీహ్యేషా గుణమయీ మమమాయా దురత్యయా
మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే॥
(భగవద్గీత 7-14)
‘అర్జునా! నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. సాధారణంగా దానిని అధిగమించడం సాధ్యం కానిది. అయినా ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వారు ఆ మాయను అధిగమించి జననమరణ చక్రబంధనాల నుంచి తరించగలరు’ అంటున్నాడు కృష్ణుడు.
సత్వరజస్తమో గుణాలు అనే మూడు దారాలతో అల్లినది ఈ ప్రకృతి. అయితే ఆ ప్రకృతి భగవంతుడిలో భాగమవుతుందా? ఎలాగైతే సూర్యుడి నుంచి వచ్చిన సూర్యరశ్మి సూర్యుడి నుంచి వేరుకాదో.. అలాగే భగవంతుడి నుంచి ఆవిష్కృతమైన ప్రకృతి కూడా భగవంతుడిలో భాగమే కాని, భిన్నమైనది కాదు. భగవంతుడు అనే ఆద్యం, అనంతమైన చైతన్యం సంకల్పంతో ఆవిష్కృతమైనది మాయ, అహంకారం, పంచభూతాత్మకమైన ప్రకృతి. నిరాకార చైతన్యం సాకారమైన ప్రకృతిగా పరివర్తన చెందే ప్రక్రియలో వెలుగు చూసేవే మాయ.. అహంకారాదులు. అహంకారం ఉనికికి ప్రతీక. నేను నాది అనేది దాని ధర్మం. ‘నేను’ అనేది భగవత్ చైతన్యం.. ‘నాది’ అనేది జీవచైతన్యం. ‘నేను’ అనబడే భగవంతుడి నుంచి ‘నాది’ అనబడే వెలుగు ప్రసరిస్తుంది. ఆ వెలుగునే ప్రకృతి అంటారు. భగవంతుడి నుంచి ప్రసరించిన వెలుగు భగవంతుడిలో భాగమే అయినా దానికి భిన్నంగా భావించడమే మాయ, కనిపించడమే అహంకారం. ఆ మాయను దాటడం అసాధ్యంకాదు కాని కష్టసాధ్యం అంటున్నాడు కృష్ణపరమాత్మ. ఎవరైతే ప్రకృతిలో ఉన్న సమస్త భేదభావనల్లోనూ భగవంతుడి ప్రతీకయైన ‘నేను’ను దర్శిస్తూ.. ధ్యానిస్తూ.. భగవంతుడికి సర్వసమర్పణ భావనతో తననుతాను సమర్పించుకుంటారో వారికి మాయను అధిగమించడం సాధ్యపడుతుంది.
సంస్థను భగవంతుడు అనుకుంటే.. సంస్థను ఆశ్రయించి వెలుగు చూసేవే.. మాయ, అహంభావం, ప్రకృతులు. అహంభావం ఉత్పత్తిగా, ఉద్యోగులు, సరఫరాదారులు, కొనుగోలుదారులను ప్రకృతిగా చెప్పుకొంటే.. సంస్థ ఉనికిని గుర్తించలేని అహంభావాదులు మాయగా చెప్పుకోవచ్చు. సంస్థ ఉంటేనే యాజమాన్యం, ఉద్యోగులు, సరఫరాదారులు, కొనుగోలుదారులకు ఉనికి. సంస్థ వెలుగే వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు లేకపోతే సూర్యరశ్మి లేనట్లే సంస్థ లేకపోతే వాటికీ ఉనికి లేదు, వెలుగూ లేదు. సంస్థలో ఒకరు ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు.. అంతమాత్రాన ‘నేనే’ అనుకుంటే అది భ్రమ మాత్రమే. అది అహంభావాన్ని పెంచుతుంది. భ్రమ మాయ అనే ముసుగును కప్పుతుంది. అహంభావ పూరిత నిర్ణయాలు పక్షపాత దృష్టికి ఆశ్రయమిస్తాయి. అహంభావం వల్ల సంక్లిష్ట సమస్యలపై పరిమిత దృష్టి అలవడి సహకారం, సమన్వయం కొరవడి అవగాహనను తగ్గిస్తాయి. ఫలితాపేక్షపై అనురాగం పెరిగి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అధికార లాలసత రాజ్యం చేస్తాయి. దానితో సంస్థ ప్రయోజనాలకన్నా స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడానికి మొగ్గుచూపుతారు. దానివల్ల సత్యాన్ని గుర్తించలేక అపజయాలను పొందవచ్చు. అపరిమితమైన సమాచారాన్ని సేకరించడం కూడా మాయ ఫలితమే. దానివల్ల ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కలవరపాటు, విభ్రమ కలగవచ్చు. పారదర్శకత కనుమరుగై వ్యక్తి కేంద్రమైన వ్యవస్థలు ఏర్పడి ఒకరిపట్ల మరొకరికి అనుమానాలు, వ్యతిరిక్తతలు, అసహనాలతో సంస్థను నిర్వీర్యం చేయవచ్చు.
సంస్థలో నాయకుడు పెద్దపెద్ద విద్యార్హతలు కలిగి ఉండవచ్చు.. అన్నీ నాకే తెలుసనే అహంభావం పొడ చూపవచ్చు. దానివల్ల ఆయన ఫలితం సాధించలేడు. సంస్థ గెలుపు బృందం గెలుపుపై ఆధారపడి ఉంటుంది.. కార్య సాఫల్యతపై దృష్టిని కేంద్రీకరించ గలిగిన ఉద్యోగుల సహకారం, ప్రతిభావంతులు, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం అవసరం అవుతుంది. స్పష్టతతో కూడిన దార్శనికత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అధికంగా కలిగిన యువతరం నైపుణ్యాలు అవసరమవుతాయి. అన్ని విభాగాలను సమన్వయం చేయగలిగే పాటవం కలిగిన వారే సంస్థను ప్రగతి మార్గంలో నడిపించ గలుగుతారు. అందరి మధ్య సయోధ్య, సమన్వయం సాధిస్తేనే విజయం సిద్ధిస్తుంది. ఫలితాలకు అతుక్కుపోయి కార్యాలను నిర్వహించడం ఉపయుక్తం కాదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని అహంభావాదులను అతిక్రమించి, తమకూ సంస్థకూ అభేదంగా భావిస్తూ.. సంస్థ శ్రేయస్సే తమ శ్రేయస్సుగా తపిస్తూ.. పరస్పర విశ్వాసం, పారదర్శకత ప్రాతిపదికగా ఉమ్మడి లక్ష్యాలకై సర్వసమర్పణ భావనతో ఉద్యమిస్తేనే అత్యున్నత స్థాయికి చేరుకుంటారు.