Chintana | ఒకసారి ఓ గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను’ అని గోడు వెళ్లబోసుకుంది. ఈ మాటలకు ప్రవక్త (స) సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆమె అక్కణ్నుంచి వెళ్లిపోయింది. తరువాత ప్రవక్త ఆ గృహిణి భర్తను పిలిచి ‘నేను ఈ రోజు మీ ఇంటికి అతిథిగా వస్తున్నాను’ అని చెప్పడంతో అతను పొంగిపోయాడు.
ఇంటికి వెళ్లి భార్యతో ‘ఈ రోజు ప్రవక్త (స) మన ఇంటికి అతిథిగా వస్తున్నారు’ అని సంతోషంగా చెప్పాడు. ఆ మాట విని ఆమె కూడా ఎంతో ఆనందించింది. భక్తిశ్రద్ధలతో రకరకాల వంటకాలు సిద్ధం చేసింది. ఇంతలో ప్రవక్త వారింటికి వచ్చారు. ఆయనకు సకల మర్యాదలు చేశారు. భోజనం ముగించుకొని తిరిగివెళ్తున్న ప్రవక్త (స) ఆ ఇంటి యజమానితో ‘నేను వెళ్లే ద్వారం వైపు చూడమని నీ భార్యతో చెప్పు’ అన్నారు. ఆ మేరకు ప్రవక్త (స) వెళ్తున్న వైపే ఆమె చూసింది. ఆయన వెనకాలే పాములు, తేళ్లూ వంటి హానికర జీవాలు ఇంటినుంచి బయటికి వెళ్లడం కనిపించింది.
ఆమెకు స్పృహ కోల్పోయినంత పనైంది. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవాలని ప్రవక్త (స) దగ్గరికి వచ్చిందామె. అదే విషయం అడిగింది. ‘ఇంటికి వచ్చిన అతిథి వెళ్తూ వెళ్తూ ఆ ఇంట్లోవారి విపత్తులు, ఆపదలు, కష్టనష్టాలన్నీ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ అతిథికి మంచి భోజనం వండటానికి చేసిన కష్టానికి ప్రతిఫలం ఇది’ అని చెప్పారు. ‘అల్లాహ్ను, పరలోక జీవితాన్ని నమ్మేవారు అతిథి మర్యాదలు చేయాలి. ఇంటికి వచ్చిన అతిథిని ఆపద అనుకోవద్దు.
అతిథిని ఇంటికి శుభంగా భావించాలి. అతిథి సత్కార్యంలో మన మేలు దాగి ఉన్నది. ఏ ఇంటి ద్వారాలైతే అతిథుల కోసం తెరిచి ఉంటాయో.. ఆ ఇంటి వారి కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. అతిథి సత్కారం స్వర్గానికి మార్గం’ అనేవారు ప్రవక్త (స). హజ్రత్ అలీ (రజి) రోజూ ఎవరో ఒకరిని ఇంటికి భోజనానికి పిలిచేవారు. అతిథి దొరకని నాడు ఆ రోజు పస్తుండేవారు. ఇలా ప్రవక్త బోధనలు విన్న సహచరులు అతిథుల రాకకోసం నిరీక్షించేవారు. అంతేకాదు తమ ఇంట్లో అతిథుల కోసం ప్రత్యేక గదిని నిర్మించేవారు. దాన్ని మెహమాన్ ఖానా అని పిలుచుకునేవారు. ఇంటికి వచ్చిన అతిథిని నవ్వుతూ స్వాగతించడం, వెళ్లేటప్పుడు గడప దాకా వెళ్లి సాగనంపడం ప్రవక్త సంప్రదాయం.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076