ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో ఆధ్యాత్మికత పల్లవిస్తుంది. పట్నం నుంచి పల్లె వరకు బోనాల సందడి సాగుతుంది. ఈ బోనాల ఉత్సవానికి కోరస్గా వినిపిస్తాయి భజనలు. ‘హరేరామ హరేరామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నాదం.. వేదమవుతుంది. రమ్యమైన రామనామం, రసరమ్యమైన కృష్ణ గానం తెలంగాణ పండరిగా పేరొందిన పాండురంగాశ్రమం నుంచి పల్లవిస్తూ ఉంటుంది. ఆషాఢంలో భక్త జన ప్రవాహంతో కిటకిటలాడే ఆశ్రమం తొలి ఏకాదశి సందర్భంగా 95వ ఆషాఢి ఉత్సవానికి వేదిక అవుతున్నది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగ ఆశ్రమం.. భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నది.
ప్రతియేట సమయాన పర్జన్య దేవుడు
కరుణించి వానలు కురుయుగాక..
పాడిపంటలతోడ కూడి భూదేవత
నిరతాన్నపూర్ణయై వరలుగాక..
గొప్ప సామాజిక చైతన్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీపాండురంగాశ్రమం ఆనాడే చాటిన లోకకల్యాణ శాంతిసౌభాగ్య మంత్రమిది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో కాలంలో విశ్వనాథ గురుదేవులు ప్రవచించిన ఈ పంక్తుల ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ తెలిసి వస్తున్నది. శతాబ్దం కిందట సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో యతివర భావానంద భారతి స్వామి వారు నెలకొల్పిన శ్రీ పాండురంగ ఆశ్రమం భక్తజనుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ, సనాతన ధర్మ పరిరక్షణకు అహరహం కృషి చేస్తున్నది. స్వామివారు నిర్దేశించిన నాదం సాదం సూక్తులు అక్కడి భగవద్గీత. నిరంతర భగవన్నామ సంకీర్తన.. నిర్విరామంగా అన్నదానం అక్కడి నిత్య కైంకర్యాలు.

ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆషాఢి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రతువులో చివరి మూడు రోజులూ జరిగే ఉత్సవాలు మరింత ప్రత్యేకం. తొలి ఏకాదశి సందర్భంగా ఆశ్రమం భక్తులతో కిక్కిరిసి పోతుంది. శ్రీభావానంద భారతి స్వామి వారు నెలకొల్పిన రుక్మిణీపాండురంగ ఆలయంలో వైభవంగా జరిగే ఉత్సవాలకు ఊళ్లు దాటి, జిల్లాలు దాటి భక్తులు తరలివస్తారు. వచ్చినవారంతా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజున తెల్లవారుజామునే స్నానాదికాలు ముగించుకొని అందరూ అన్నప్రసాదం కోసం వేచి ఉంటారు. భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అంతా క్రమశిక్షణగా కూర్చొని అన్న ప్రసాదం కోసం వేచిచూస్తారు. ముత్యాల్లాంటి అన్నం.. రుచికరమైన వేడివేడి సాంబారు. ఇదే ఆషాఢి ఉత్సవ ప్రత్యేక అన్నప్రసాదం. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదంలా ఆషాఢి సాంబారు కూడా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఎందరు వచ్చినా అందరికీ అన్నం అందుతుంది. ఎందుకు అందదూ.. అన్నప్రసాదం ఎంత వండాలో అక్కడ సాక్షాత్ పాండురంగడే నిర్ణయించడం విశేషం. ఏటా ఉత్సవాలు ప్రారంభం కాగానే స్వామి ముందు ధర్మచీటీలు వేస్తారు. అందులో ఎన్ని క్వింటాళ్లు వండాలని వస్తే సరిగ్గా అన్ని క్వింటాళ్లే వండుతారు. ఒక మెతుకు అటూ ఇటూ కాకుండా ఆ అన్నమే అందరికీ కడుపునిండా సరిపోతుంది. అన్నాన్ని పెద్ద రాశిగా పోసి పూజచేస్తారు. చాటలతో వడ్డించడం.. పేద, పెద్ద తేడా లేకుండా సహపంక్తి భోజనం చేస్తారు. ద్వాదశి రోజున అన్నదానంలో పాల్గొనాలని, ఒక్క ముద్ద ప్రసాదం స్వీకరిస్తే జన్మకు సార్థకత అని భక్తులు విశ్వసిస్తారు.
సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఆశ్రమం కార్యక్రమాలు ఉంటాయి. నిరంతరం ఏదో ఒక ఆధ్యాత్మిక క్రతువు తలపెట్టి.. భక్తుల భాగస్వామ్యంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారు ఆశ్రమ నిర్వాహకులు. సంకల్పం లోక కల్యాణం. సందేశం నామ స్మరణమే ముక్తి మార్గం. ఇదే సంకల్పంతో వందేండ్ల కిందట భావానంద భారతీ స్వామి వారు భక్తి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ‘రామనామ’ సంకీర్తన ఉద్యమాన్ని నిర్విరామంగా నిర్వహించారు. స్వామివారి భక్తుడు రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి నేతృత్వంలో వంద భజన సంఘాలు ఏర్పడి, ఆనాడు భక్తి ఉద్యమాన్ని కొనసాగించాయి. తర్వాతి కాలంలో స్వామివారి పూర్వాశ్రమ కుమారుడు మహాత్మ అప్పాల విశ్వనాథ శర్మ ‘భగవత్ సేవా సమాజం’ సంస్థను స్థాపించి నామ సంకీర్తనను కొనసాగించారు. ఆ మహితాత్ములు ఏర్పరచిన దారుల్లో ఇప్పుడు భక్తి ఉద్యమం మళ్లీ పురుడు పోసుకున్నది. లోక కల్యాణం కోసం ఆశ్రమ నిర్వాహకులు సంకల్పించిన ‘సార్థ త్రి శతకోటి హరేరామ నామ జపయజ్ఞం’లో అశేష సంఖ్యలో భక్తులు భాగమవుతున్నారు. గత నెల 23న మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో భగవత్సేవా సమాజం 90వ శాఖ ప్రారంభమైంది. వడివడిగా 100వ శాఖవైపు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పూర్తికాగా.. మూడువందల కోట్ల జప యజ్ఞం వైపు భక్తి ఉద్యమం అడుగులు వేస్తున్నది.

త్రిశత కోటి మహా యజ్ఞంలో భాగంగా ‘భగవత్ సేవా సమాజం’ ఆధ్వర్యంలో ప్రతీ ఏకాదశికి ఆయా గ్రామాల్లో సామూహిక నామ సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఏకాదశి వేకువ జామునే భక్తులంతా ఒక్కచోటుకు చేరుకుంటారు. అందరూ భక్తిభావంతో ‘నగర సంకీర్తన’కు కదులుతారు. ‘హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే॥’ మహామంత్రాన్ని మనోహరంగా ఆలపిస్తూ ముందుకుసాగుతారు. ఊరంతా తిరిగి రాములవారి కోవెల దగ్గరో, అంజన్న ఆలయం దగ్గరో కాసేపు ఆగి భజన నిర్వహిస్తారు. రామనామాన్ని మనసారా ఆలపిస్తూ భక్తి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ఏకాదశి నగర సంకీర్తనకు తోడుగా.. వేలాది మంది ఆశ్రమ భక్తులు నిత్య జపం చేస్తున్నారు. ‘హరేరామ.. హరేకృష్ణ’ మంత్రాన్ని జపం చేసి, ప్రతి రోజూ సాయంత్రానికి జప సంఖ్య నిర్వాహకుల వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తారు. ఇప్పటివరకు జప సంఖ్య రెండు వందల కోట్లకు చేరువగా ఉన్నది. నామ సంకీర్తనతో మనసులో భక్తి నిలుస్తుంది. మనిషిలో ధనాత్మక వైఖరులు పెరుగుతాయి.

భావానంద భారతి స్వామి వారి పూర్వాశ్రమ పుత్రులు.. ఆశ్రమ సర్వాధ్యక్షులు మహాత్మ విశ్వనాథ గురుదేవుల శతజయంతి ఉత్సవాలు ఆషాఢ మాసం వెళ్లగానే శ్రావణమాసం నుంచి ప్రారంభం కానున్నాయి. తన అద్భుతమైన రచనలతో.. మార్గ నిర్దేశంతో భక్తులకు దారి చూపిన గొప్ప ఆధ్యాత్మికవేత్త విశ్వనాథ గురుదేవులు. సంవత్సరం అంతా ప్రతినెలా ఒక కార్యక్రమం నిర్వహించి శతజయంతి సమాపనోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆశ్రమ నిర్వాహకులు నిర్ణయించారు. గురుదేవుల శతజయంతి సంవత్సరం ముందు వస్తున్న ఈ ఆషాఢి ఎంతో ప్రత్యేకమైనది.