ఒకసారి ఆధ్యాత్మిక గురువరేణ్యులు రామకృష్ణ పరమహంస తీర్థయాత్రలో భాగంగా బృందావనం వెళ్లారు. శ్రీకృష్ణ పరమాత్మ లీలాక్షేత్రమైన ఆ పుణ్యస్థలిలో పర్యటిస్తూ గోవర్ధనగిరిని సందర్శించారు. మురళీకృష్ణుడి గోవర్ధోనోద్ధార ఘట్టం తలచుకొని పరవశించారు. ‘కృష్ణా! నీవు నడయాడిన బృందావనం అప్పటిలాగే ఉంది. గోవర్ధన పర్వతం, చెట్టూ, పుట్టలు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ నీవే లేవు. ఎప్పుడు దర్శనమిస్తావయ్యా?’ అని భక్తితో విలపించారు. ఆ భక్తి పరవశంతో బృందావనంలోనే ఉండిపోదాం అనుకున్నారు. కానీ, మాతృమూర్తి గుర్తొచ్చి కలకత్తా తిరిగివచ్చారు. పవిత్ర బృందావనంలోని మట్టిని, కొన్ని పూల మొక్కలను తాను నివసించే దక్షిణేశ్వరానికి తెచ్చుకున్నారు. ‘గంగాజలాన్ని సాధారణమైన జలంగా భావించకూడదు. బృందావన ధూళిని సామాన్యమైన ధూళిగా తలచరాదు. అవి సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపాలు’ అనేవారు ఆ పరమహంస.
పరమహంస కృష్ణాష్టమి సత్సంగంలో భాగంగా ఒకసారి కలకత్తాలోని నవగోపాల్ఘోష్ అనే గృహస్థుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఓ వైష్ణవగాయకుడు మనోహరంగా శ్రీకృష్ణ సంకీర్తనను ఆలపించసాగారు. వెంటనే రామకృష్ణులు లేచి గబగబా ఆ ఇంటిప్రాంగణంలోకి వెళ్లారు. కృష్ణుడి విగ్రహానికి అలంకరించి ఉన్న పిల్లనగ్రోవిని తీసుకొని బాలగోపాలుని భంగిమలో నిలబడి ధ్యాన నిమగ్నులైపోయారు. అదేవిధంగా పరమహంస ఓ రోజు తమ మేనల్లుడితో ‘కృష్ణుడిలా పచ్చటి వస్త్రం ధరించాలని ఉంది’ అన్నారు. అప్పుడు అతను ఒక కొత్త పచ్చటి వస్ర్తాన్ని తెచ్చి ఆయనకు ఇచ్చాడు. దాన్ని ధరించిన పరమహంస కృష్ణుడి విశేషణాలు ఉచ్చరిస్తూ ధ్యానస్థితిలోకి వెళ్లిపోయారు. ఇలా కృష్ణ తత్త్వం, కృష్ణ జన్మాష్టమి రెండూ పరమహంస చరిత్రలో అంతర్భాగం అయిపోయాయి.
…? మనోజ్ఞ