అంతర్మథనం ఆవిరై
తెగింపు
ఒక ఉరుమైతది
అన్నింటినీ కూడదీసుకొని
పిడికిలి మూసుకుంటది
బరిగీసి ఒక శకలం
తీరంపై క్షణ క్షణం
గెలుపును శ్వాసిస్తుంది.
భూమి గుండెలో
అనంతంగా మరిగిన
ఒక ఎర్రని ఆవేశం
నింగి సిగకు
మెరుగుపూల హారం
చుడుతుంది
అంతర్యుద్ధంలో
ఓడిన పువ్వు
అల్లరి వాకిట్లో
నవ్వై పరుచుకుంటది.
జీవితం సరళరేఖపై
నెత్తురోడిన గాయం
చివరికి ఒక అనివార్య
విజయ తీరం మీద
శిఖరమై మొలుస్తుంది.
చివరి క్షణం తర్వాత
మౌనం పగిలిపోయి
అడుగులకు పయనం వైపు
తోవ చూపుతుంది.