ఒక ఇంజినీరింగ్ విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. అప్పటివరకు అంత భారీ ప్యాకేజీ వచ్చిన వారు అతని బంధుమిత్రులలో ఎవ్వరూ లేరు. ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలని హాస్టల్ నుంచి గ్రామంలోని ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ స్వీట్లు కూడా తీసుకుని వెళ్లాడు. అతని తల్లిదండ్రులు రైతులు. కొడుక్కు ఉద్యోగం వచ్చిందన్న వార్త విని వాళ్లు ఎంతో సంతోషించారు. తల్లి కొన్ని స్వీట్లు కొడుకు చేతికి ఇచ్చి ఊళ్లో బంధుమిత్రులకు పంచి ఉద్యోగ విషయం చెప్పి రమ్మంది. ఎగురుకుంటూ ఊళ్లోకి నడిచాడు. అమ్మ చెప్పినట్టే సన్నిహితులను కలిసి విషయం చెప్పి స్వీట్లు పంచాడు. ఇంటికి వచ్చేలోగా బాగా పొద్దుపోయింది. తిన్నామంటే తిన్నామన్నట్టుగా తిని ఇంటి పెరట్లో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు యువకుడు. కొడుకు ఎంతసేపైనా నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించింది తల్లి. దగ్గరికి వెళ్లి, పక్కన కూర్చుని ‘ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా?’ అని ప్రశ్నించింది. కొడుకు వాడిన ముఖంతో ‘అదేమీ లేదు, అందరూ అభినందించారు. అయితే వారి మాటల్లో నేను వారికన్నా గొప్పోడిని అయిపోతానేమోననే అసూయ స్పష్టంగా కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
‘ఎదుటివాడు నాకన్నా గొప్పవాడు కావాలి’ అని మనస్పూర్తిగా కోరుకునే వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరా… అనే ఆలోచన నాలో మొదలయ్యింది. అలాంటి సహృదయులు కనబడితే పాద నమస్కారం చేయాలని ఉంది. ఆ ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు’ అని సమాధానం ఇచ్చాడు. తల్లి చిన్నగా నవ్వి ‘అయితే నువ్వు పాద నమస్కారం చేయాల్సింది నీ తండ్రికి. కన్నతండ్రి మాత్రమే నువ్వు అనుకున్నట్టు కోరుకుంటాడు. కొడుకును చూసి ఏ తండ్రీ అసూయపడడు. ఇంకా తనకన్నా తన కొడుకు మరింత ఎదగాలని, తనకన్నా గొప్పవాడు కావాలని పరితపిస్తాడు. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడతాడు’ అని చెప్పింది. తండ్రి పాదాలకు నమస్కరించడానికి ఆ యువ ఇంజినీర్ చిన్నగా అక్కడినుంచి కదిలాడు.