వయసుపైబడిన ఒక జమీందారుకు పవిత్ర శివ క్షేత్రమైన రామేశ్వరం చూడాలనిపించింది. ప్రయాణ ఏర్పాట్లు సిద్ధం చేసుకుని బయల్దేరే ముందు తన తల్లి ఆశీర్వాదం కోసం వెళ్లాడు. ‘కాశి, రామేశ్వరం చూడాలని ఉన్నా నేను చూడలేకపోయాను. నీకు ఆ అదృష్టం కలిగింది, చాలా సంతోషం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన రామేశ్వరం వెళ్తున్న నీకు ఎప్పటికీ చెడనిది ఏమిటో తెలుస్తుందిలే నాయనా!’ అని ఆశీర్వదించి పంపింది. ప్రయాణంలో జమీందారుకు తన తల్లి చెప్పిన ‘ఎప్పటికీ చెడనిది ఏమిటి?’ అని ఆలోచనలు మొదలయ్యాయి. ఎంత ఆలోచించినా అతనికి సరైన సమాధానం స్ఫురించలేదు. తనతోపాటు ప్రయాణిస్తున్న వారిని అడిగి చూశాడు. సంతృప్తికరమైన సమాధానమేదీ దొరకలేదు. ఎలాగైతేనేమి రామేశ్వరం చేరాడు. రామనాథ స్వామిని దర్శనం చేసుకున్నాడు. గుడి సమీపంలోని సముద్రం ముందు అలలవైపు చూస్తూ తన తల్లి మాటలను గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
ఇసుకలో నడిచి వెళ్తున్న ఓ సాధువు జమీందారును చూసి ఆగాడు. ‘దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’ అని అడిగాడు. తన తల్లి పలికిన మాటలు చెప్పాడు జమీందారు. సాధువు చిన్నగా నవ్వి ‘జన్మించిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఎన్నో పనులు చేస్తుంటారు. వీటిలో మంచి చెడు కలిసి ఉంటాయి. అవి మంచైనా, చెడైనా ఆ కర్మఫలాన్ని మాత్రం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు. దేవుడైనా సరే, మానవ జన్మ స్వీకరించాక కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఏ వస్తువైనా, పదార్థమైనా కొన్నాళ్లకు చెడి పోతుందేమో కానీ చేసిన కర్మలు ఎప్పటికీ చెడవు. ఆ కర్మఫలం అనుభవించేంత వరకు అవి మనతోటే ఏమాత్రం చెడకుండా ఉంటాయి’ అని సమాధానమిచ్చి వెళ్లిపోయాడు. ‘కర్మఫలం అనుభవించక తప్పదని, కష్టనష్టాలకు దేవుడిని నిందించడం మంచిది కాదని’ తన తల్లి చెప్పకనే చెప్పిన మాటల అంతరార్థాన్ని జమీందారు తెలుసుకున్నాడు.