ఏ పనికైనా సంకల్ప శుద్ధి అవసరం. మన ఆచరణలు సంకల్పాలపైనే ఆధారపడి ఉంటాయి. సంకల్పానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. మనిషి మంచి ఉద్దేశాన్ని బట్టి అతనికి అల్లాహ్ మంచి చేస్తాడు. మనిషిది దుష్ట సంకల్పం అయితే అతనికి దక్కేది దుష్ఫలితమే! అందుకే ఏ పనిచేసినా దేవుడి ప్రసన్నతను దృష్టిలో ఉంచుకొని చేయాలి. మన అంతరంగాన్ని ఎల్లవేళలా అల్లాహ్ గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తెరిగి కార్యాలు చేపట్టాలి.
మన సంకల్పాన్ని పాడు చేసే విషయాల నుంచి మన అంతరంగాన్ని కాపాడుకోవడం అందరికీ అత్యవసరం. భార్యాపిల్లల సేవ కన్నా తల్లిదండ్రుల సేవకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కార్మికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు సన్నిహిత బంధువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక వ్యక్తి మంచి పని చేయాలని సంకల్పించుకొని… ఆ పని చేయలేకపోయినా, అతనికి పుణ్యఫలం దక్కుతుంది. మంచి సంకల్పంతో తమ బాధ్యతలు నెరవేర్చిన వారికే అల్లాహ్ స్వర్గలోక ప్రవేశం కల్పిస్తాడు.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076