Vinayaka Chavithi | వినాయక చవితి వచ్చిందంటే ప్రతి పల్లెలో సందడి మొదలవుతుంది. వాడవాడలా మంటపాలు వెలుస్తాయి. గౌరీ తనయుడి విగ్రహాలు ఇబ్బడిముబ్బడిగా కొలువుదీరుతాయి. మహారాష్ట్రలో అయితే చవితి సంబురాలు మిన్నంటుతాయి. కానీ, అదే రాష్ట్రంలోని ఓ పల్లెలో మాత్రం ఇందుకు భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. కానీ, గణేశుడి విగ్రహాలు పెట్టరు. గ్రామంలోని ఆలయంలో ఉన్న వినాయకుడి మూలమూర్తికే ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రులూ ఘనంగా నిర్వహిస్తారు. అంతేకానీ, చవితి మంటపాలు ఏర్పాటు చేయరు, విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించరు, ఇంటింటా కూడా విగ్రహాలు కొలువుదీర్చరు. వింత గొలిపే ఆ ఆచారం కథ ఇది..
మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్ జిల్లా మాల్వాణ్ తాలూకాలో ఉంటుంది కోయిళ్ గ్రామం. ఇక్కడ ఏ ఇంట్లోనూ వినాయకుడి ప్రతిమ కనిపించదు. ఆ మాటకొస్తే గణపతి క్యాలెండరో, చిత్తరువో కూడా ఉంచుకోరు. పెండ్లి పత్రికల మీద కూడా గణపతి బొమ్మ అచ్చు వేయించరు. ఇదంతా చూస్తే.. కోయిళ్ వాసులకు గణపతిపై నమ్మకం లేదనుకుంటే పొరపాటే! ఆ ఊరికి గ్రామదేవత మరెవరో కాదు.. ఆ గజాననుడే!! అయినా, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆలయంలో కొలువైన వినాయకుణ్ని తప్ప మరే గణపతి మూర్తినీ ప్రతిష్ఠించుకోరు, పూజించరు. దాదాపు 700 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నదని స్థానికుల మాట. దీన్ని అతిక్రమించి ఇండ్లల్లో వినాయకుడి ప్రతిమ గానీ, ఫొటో గానీ ఉంచితే కీడు జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే, ఆలయంలోని ఏకదంతుడే.. తమ ఏకైక దైవమని నమ్ముతారు.
వినాయక చవితి వచ్చిందంటే.. కోయిళ్లో కోలాహలం మొదలవుతుంది. చవితి నుంచి అనంత చతుర్దశి వరకు గణేశుడి ఆలయంలో విశేష ఉత్సవాలు చేస్తారు. పండుగకు ముందే ఊరంతా తిరిగి వంట సామగ్రి సేకరిస్తారు. పదకొండు రోజులపాటు గ్రామస్తులందరూ కలిసి వంటలు చేస్తారు. రెండు పూటలా సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ పదకొండు రోజులు వినాయకుడి పూజ కోసం ఉపయోగించిన ద్రవ్యాలన్నింటినీ.. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు. ‘ఒక గ్రామం.. ఒకే వినాయకుడు’ సంప్రదాయం వింతగా అనిపించినా.. అందరినీ సంఘటితంగా ఉంచడానికే తమ పూర్వికులు ఈ ఆచారం నియమం చేశారేమో అని స్థానికులు చెబుతారు. ఏదైతేనేం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా, నిర్మలమైన మనసుతో కోయిళ్వాసులు శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తుండటం విశేషం!