భగవంతుడు శక్తిమంతుడు. భగవతి శక్తి స్వరూపిణి. శక్తి శక్తిమంతులకు అభేదం. ‘పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే’- ఆ పరాశక్తి అనేక విధాలని శ్వేతాశ్వతరోపనిషత్తు. కృష్ణావతారంలో ప్రధానంగా రుక్మిణి సత్ శక్తి- శ్రీ మహాలక్ష్మి, జాంబవతి చిత్ శక్తి- శ్రీమహాకాళి, సత్యభామ ఆనందశక్తి- శ్రీ మహాసరస్వతి. ఈ త్రిశక్తి స్వరూపాలను పరమాత్మ ప్రథమంగా వరించాడని శ్రీ అఖండానంద స్వామి వ్యాఖ్య. ఇక భగవంతునికి, తామరసాక్షునికి, కల్యాణ కృష్ణునికి, తామరతంపర- అభ్యుదయ పరంపరగా వివాహ పరంపర సాగింది. వాస్తవానికి వాసుదేవునికి ‘వివాహః’ అని అన్వర్థం- సాభిప్రాయంగా, ‘యాని నామాని గౌణాని’ అన్న విధంగా ఒక విలక్షణమైన గౌణ నామధేయం! ‘వి’ అనగా ‘వాతి గచ్ఛతి ఆకాశే’ ఇతి ఆకాశంలో వెళ్లునది- పక్షి. అది- అనగా గరుత్మంతుడు వాహనంగా కలవాడు కాన ఆయన వివాహుడు. పేరే వివాహుడైనప్పుడు ఆయన్ని ప్రేమించి, పెళ్లి చేసుకోమని కోరని వారిదే ఘోరమైన తప్పిదం. భాగవతంలో హరి- శ్రీకృష్ణుని భార్యలందరూ వారంతట వారే ఏరికోరి వరించి ఆయనను మనువాడినవారే. ‘స్త్రీ పాయ మితరత్ సర్వం జగన్నాథైక పూరుషం’- సృష్టికి ఏకైక పురుషుడైన జగన్నాథునికి- పురుషోత్తమ దేవునికి స్త్రీ సమానులైన జీవులందరూ భార్యలే!
శుకయోగి ఎకిమీడు- ప్రభువు పరీక్షిత్తుతో- రాజా! ఒకనాడు బకవైరి ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు పాండవులను పరామర్శించడానికి ఇంద్రప్రస్థానికి వెళ్లాడు. పాండు నందనులు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాల వలె యాదవేంద్రుని గుండెకు హత్తుకొని అమంద- నిండైన ఆనందం పొందారు. కంత (మన్మథ) జనకుడు కుంతి చెంతకు చేరి ఏకాంతంలో నమస్కరించి..
కం॥ ‘అత్తా! కొడుకులు గోడలు
జిత్తానందముగ బనులు సేయగ నాత్మా
యత్తానుగవై యాజ్ఞా
సత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్’..
‘అత్తా! నీ కొడుకులు, కొత్త కోడలు- యాజ్ఞసేనీ భక్తిశ్రద్ధలతో సంతోషంగా నీ ఆజ్ఞలను తలదాల్చి ఆదరాభిమానాలతో నీకు సేవలు చేస్తున్నారు కదా! ఇప్పుడు నీ చిత్తం కుదటపడి హృత్తాపాలు తొలగి సంతోషంగా మనుగడ సాగిస్తున్నావా?’ అని అడిగాడు. కష్టాలలో పండిపోయిన పాండుపత్ని కుంతి కనుల నీరు నిండగా అండజవాహనునితో ఇలా అన్నది.. ‘కృష్ణా! బంధువులను మరచిపోకుండా ఆదరించే ఆనంద సింధువు అయిన నీ అండదండలు వల్లనే మేము జీవించి ఉండగలుగుతున్నాము. ఇందీవరశ్యామా! నీవు అందరిలో ‘ఆత్మ’గా వెలుగొందుతున్నప్పటికీ, హృదయారవిందంలో నిన్ను స్మరిస్తూ వందించే వారినే నీవు కనువిందు చేస్తూ కరుణిస్తావు’.
శుకుడు- రాజా! ఒకనాడు కృష్ణార్జునులు వేటకై అడవికి వెళ్లగా అక్కడ కిరీటికి దాహం వేసింది. నర నారాయణులిద్దరూ యమున వద్దకు చేరి అందలి తరంగాలలో అందాలొలికే కాళిందిని- సూర్యపుత్రికను చూచారు. అచ్యుతుడు పంపగా తన చెంతకు వచ్చిన వివ్వచ్చు- అర్జునునితో ఆ అమ్మాయి ఇలా పలికింది..
మ॥ ‘నరవీరోత్తమ! యేను సూర్యునిసుతన్, నా పేరు కాళింది, భా
స్కర సంకల్పిత గేహమందు నదిలో గంజాక్షు విష్ణుం బ్రభున్
వరుగా గోరి తపంబు సేయుదు, నొరున్ వాంఛింప, గృష్ణుండు వ
న్యరతిన్ వచ్చి వరించు నంచు బలికెన్ నా తండ్రి నా తోడుతన్’
‘ఓ వీరాధివీరా! నేను సూర్య పుత్రికను. నా పేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి ఏర్పరచిన సదనంలో మదన జనకుని- ముకుందుని మదిలో పతిగా కోరి తపిస్తున్నా. ఇతరులను నేను సుతరాం- ససేమిరా వరించను. శ్రీహరి వేటకు వచ్చి నిన్ను స్వీకరించగలడని నా తండ్రి చెప్పిన మాట’. కాళింది అన్న పలుకులను కవ్వడి- సవ్యసాచి అర్జునుడు వెన్నునికి- విష్ణువుకి విన్నవించగా సర్వజ్ఞుడైన హరి ప్రసన్నుడై వడి-వడిగా వచ్చి సన్నని నడుము గల ఆ కన్నియను పరిగ్రహించాడు.
‘కోరుక్ హితమిత భుక్’ (హితకరమైన ఆహారాన్ని కూడా మితంగా భుజించడమే ఆరోగ్యకరం) అని హితవు పలుకుతుంది ఆయుర్వేదం. అతిగా తింటే అదితి నందను- దేవతలకైనా అజీర్తి వలన వెతలు తప్పవు. అందునా సర్వభక్షకుడైన అనలునికి (అలం పర్యాప్తిః నాస్తి అస్య అనలః- ఎంత వడ్డించినా ఇక ‘చాలు’ అనేది లేనివాడు)- అగ్నిదేవునికి అగ్ని మాంద్యం- అజీర్ణం! వైద్యుడు వానస్పత్య ఔషధం- అరణ్యంలో విస్తారంగా లభించే పత్ర, ఫల, మూలికా కాష్ఠాలు భేషజం- మందుగా విధించాడు. దేవేంద్రుని ఖాండవ వనాన్ని వీతి హోత్రునికి- అగ్నికి ఆహారంగా అర్పించడానికి నిశ్చయించి దేవకీ సూతి- కృష్ణుడు శ్వేత వాహను- అర్జునుని రథానికి తాను సూతుడు- సారథి అయ్యాడు. తాను నిరతిశయ ఐశ్వర్య సంపన్నుడైనా తన్ను నమ్ముకొన్న ఇంద్రసూతి- అర్జునునికి దివ్యమైన ధనుర్బాణాలు ఒనకూర్చడానికి కృష్ణ పరమాత్మ సూతుడయ్యాడని శ్రీధర వ్యాఖ్య. నరనారాయణుల సహాయంతో అనలుడు- అగ్ని ఖాండవ వనాన్ని దహించి అజీర్ణం అంతం కాగా, ఆరోగ్యవంతుడై సంతసించి పాండవ మధ్యమునికి అక్షయ తూణీరాలు, అభేద్య కవచం, గాండీవ నామక ధనుస్సు, దివ్య రథమూ, ధవళ (తెల్లని) రథ్యా- గుర్రాలను సమర్పించాడు.
ఉ॥ ‘వాసవ సూనుచే దనకు వహ్ని శిఖాజనితోగ్ర వేదనల్
వాసిన జేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుడై
యా సభలోన గాదె గమనాగమనంబుల గౌరవేంద్రుడు
ల్లాసము బాసి యుండుట జలస్థల నిర్ణయ బుద్ధిహీనుడై’
ఖాండవ వన దహన సమయంలో ఆ దారుణ దాహ కాండలో అగ్ని జ్వాలల వేదన నుంచి తప్పించి తనను కాపాడినందుకు మయుడు సంతోషించి ఒక మహా (మయ) సభను నిర్మించి పాండు సుతునకు బహూకరించాడు. వర్ణనాతీతం అద్భుత వైభవోపేతమైన ఆ సభలోనే ఉల్లాసంతో సంచరిస్తూ కౌరవేంద్రుడు- దుర్యోధనుడు జలానికి, స్థలానికి భేదం గుర్తించలేక పరిహాస (ఎగతాళి, ఎద్దేవ) పాత్రుడై అవమాన ఖేదం పొందాడు.
శుకుడు- రాజా! పాండవులను వీడ్కొని ద్వారకకు తిరిగి వచ్చిన వ్యాల- కాళియ మర్దనుడు ఒక శుభముహూర్తంలో కాళిందిని వివాహమాడాడు. అనంతరం, ఉరుక్రముడు- కృష్ణుడు స్వయంవరంలో అవక్రపరాక్రమం ప్రదర్శించి, తన మేనత్త రాజాధిదేవి పుత్రిక , అవంతీ పరిపాలకులైన విందానువిందుల చెల్లి అలినీలవేణి, అందాల రాణి మిత్రవిందను కళత్రంగా పొందాడు.
కోసల దేశాధిపతి నగ్నజిత్తు. నగ్నులు అనగా వేదశాస్త్రములనే వస్ర్తాల ఆవరణను- ధారణని అంగీకరించనివారు. అనగా పాఖండులు (పాషండులు). వేదశాస్త్ర విరోధులు. అట్టి నగ్నులను జయించిన ధర్మాత్ముడు కాన నగ్నజిత్తు. అతని కుమార్తె ‘సత్య’. తండ్రి పేరిట ‘నాగ్నజితి’గా ప్రసిద్ధురాలు. యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణుని యందే మనసు లగ్నం చేసిన సద్గుణ సంపన్న. తన వద్ద ఉన్న మదించిన ఏడు వృషభా- ఆబోతులను కట్టడి చేయగలవాడే నాగ్నజితి సతీమతల్లికి పతిగా కోసలపతి నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి కాలుదువ్వి ఆ ఎద్దులను పట్టి కట్టజాలక, వాటి గిట్టల దెబ్బలకు తట్టుకొనలేక నాగ్నజితి చెట్టపట్టలేక భగ్న హృదయులై మరలిపోయారు. సత్య హృదయం తెలుసుకొన్న సదయుడు మాధవుడు కోసల దేశానికి తరలివచ్చి, రాజును చూచి మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు..
కం॥ ‘అన్యుల యాచింపరు రా
జన్యులు సౌజన్యకాంక్ష జనుదెంచితి నీ
కన్యన్ వేడెద నిమ్మా!
కన్యాశుల్కదుల మేము గాము నరేంద్రా!’
‘మహారాజా! రాజన్యులు పరులను అర్థించరు. సౌజన్యంతో నేనే వచ్చి నీ కన్యా రత్నాన్ని కోరుతున్నాను. మేము కన్యాశుల్కం ఇచ్చేవారం కాము’. అచ్యుతుని మాటలు విని అవనీపతి నగ్నజిత్తు ఇలాగని అన్నాడు..
శా॥ ‘ఉష్ణాంశుండు తమంబు దోలుక్రియ నీ వుగ్రాహవక్షోణిలో
గృష్ణా! వైరుల దోలినాడవు, రణక్రీడా విశేషంబులన్
నిష్ణాతుండవు, సప్త గోవృషములన్ నే డాజి భంజించి రో
చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశు బింబాననన్’
ఈ శార్దూల వృత్తంలో భక్తకవి శార్దూలుడు పోతన ‘ష్ణ’ అనే కఠిన సంయుక్తాక్షర ప్రాసను గైకొని ఎంత అర్థవంతంగా సమర్థంగా పద్యాన్ని పూరించాడో చూడండి! ‘ఉష్ణాంశుండు- కాక వెలుగు (సూర్యుడు) కారుచీకట్లను పోకార్చునట్లు, కృష్ణా! నీవు ఉగ్రమైన రణరంగంలో వైరి (శత్రు) వర్గాన్ని పారద్రోలావు. అమరవల్లభా! సమర క్రీడలో నీవు నిష్ణాతుడవు- నితరాం (మిక్కిలి) చతురుడవు. ఈ ఏడు వృషభాలతో ఈ నాడు పోరాడి జిష్ణువు- జయశీలివై ప్రకాశిస్తూ ఇందుముఖి నాగ్నజితిని పొంది, ముకుందా! మా డెందాలకు విందు చేయుము’ అని భూజాని (రాజు) తన తనయ- కుమార్తె వివాహ విషయంలో చేసుకొన్న ఘనమైన నియమాన్ని చెప్పగా విని..
చం॥ ‘కనియె నఘారి వత్స బక కంస విదారి ఖలప్రహారి దా
ఘనతర కిల్బిషంబుల నగణ్య భయంకర పౌరుషంబులన్
సునిశిత శృంగనిర్దళిత శూర సమూహ ముఖామిషంబులన్
హనన గుణోన్మిషంబుల మహాపురుషంబుల గోవృషంబులన్’
అఘాసుర సంహారి, వత్సాసుర బకాసుర కంసాదుల విదారి- చీల్చి చెండాడిన వాడు, ఖల ప్రహారి- దుష్టులను మట్టుపెట్టిన వాడు అయిన కృష్ణ భగవానుడు, ఎనలేని పౌరుషం కలవీ, తమ పదునైన కొమ్ములతో ఎందరో అరిందము- వీరుల ముఖారవిందాలను కుమ్మి- పొడిచి గాయపరచినవీ, రూపుదాల్చిన పాపరాసుల వలె ఉన్న నూపురాలతో చూపరులకు భీతి గొలుపు ఆబోతులను ఆలోకించాడు. పై చేలాన్ని- వస్ర్తాన్ని నడుముకు బిగించి కట్టుకొని, చూడ చిత్రంగా తనను ఏడు మూర్తులుగా మలచుకొని, బాలుడు కొయ్య బొమ్మలను పట్టుకున్నట్టుగా, కొండల వంటి ఆ ఏడు ఆబోతులను ఒయ్యారంగా పట్టి గుద్ది, కుమ్మి అవలీలగా నేలపై కూలదోశాడు. గోపాలుని పరాక్రమం చూచి అచ్చట ఉన్న భూపాలకులంతా అబ్బురపడుచూ పరిపరి విధాల ప్రశంసలు కురిపించారు. నగ్నజిత్తు తన పుత్రికను పురుషోత్తమునికిచ్చి శాస్ర్తోక్తంగా వివాహం జరిపించాడు. పిమ్మట శ్యామభద్రుడు, కేకేయ దేశపు రాకుమారి, తన మేనత్త శ్రుతకీర్తి కూతురూ అయిన ‘భద్ర’ను పరిణయమాడాడు. ఆపై కమలాక్షుడు మద్రరాజ పుత్రికను- మృగేక్షణ, సర్వశుభ లక్షణ అయిన ‘లక్షణ’ను సులక్షణంగా పరిగ్రహించాడు. పారమార్థికంగా పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం- ఈ అష్టవిధ ప్రకృతులే పురుషుడైన శ్రీకృష్ణుని అష్టపత్నులు.