ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం. ముంగిళ్లలో తోరణాల హరిత లాస్యం. వంటింట ఘుమఘుమల సయ్యాట. నాలుకపై షడ్రుచుల నాట్యం. ఉగాది అంటే ఉవ్వెత్తున ఉప్పొంగే కవిత్వం. కొత్త ఏడాదికి కొంగొత్తగా స్వాగతం పలికే వైతాళిక గీతం. కలాల కోలాటంలో కవితల ఉబలాటం. అక్షరాల ఆత్మీయ ఆలింగనం. పచ్చని కొమ్మల్లో మోగే కోయిల గానం.. మది మదిలో హర్ష ధ్వానం..
అవును! నువ్వు ‘శ్రీముఖం’లో పుట్టినా నేను ‘స్వభాను’లో భూమి మీదికి అడుగు పెట్టినా ఆమెది ‘విజయ’ నక్షత్రం ఐనా ఇతను‘వికారి’ జాతకుడైనా అందరం ఒకే ఆకాశం కింద బతుకుతున్న వాళ్ళమే! ఒకే కాలంతో పాటూ నడవాల్సిన వాళ్ళమే ఆది, సోమవారాలుగా రోజుల్ని పిలుస్తున్నా క్రోధి, ఆనంద లుగా యేళ్ళని విభజించుకున్నా కృష్ణ, శుక్ల పక్షాలుగా నెలని చూసుకున్నా వసంత, శిశిర ఋతువులుగా గుర్తుంచుకున్నా పేరేదైనా, పాత్రేదైనా, ప్రాంతమేదైనా అంచనాలు, అక్షాంశాలు తప్ప కాలపు రంగు, రుచి, వాసన తెలిసిందెవ్వరికి? పొడుగో, పొట్టో, లావో, సన్నమో చూసిందెవ్వరు? ప్రభవ నుండి పుట్టిన కాలరాశి అక్షయంగా విస్తరించి తరతరాలుగా ప్రవహిస్తూనే యుండొచ్చు గాక! అరవై గడుల రంగుల రాట్నంగా అలుపు లేకుండా తిరుగుతూనే వుండొచ్చు గాక! ‘ఆగిపోవటం కాదు సాగిపోవటమే బ్రతుకు’ అని మనిషికి తెలిసి ఉండాలిగా! గాయం తెలిసిన శరీరం జ్ఞాపకం ఎరిగిన మనసు వంచన అనుభవించిన జీవితం జ్ఞానం పొందిన ఆత్మ కాలమానాన్ని అర్థం ఎందుకు చేసుకోదు? ప్రతి కష్టానికి ఒక కారణాన్ని ప్రతి విజయానికి ఒక స్వోత్కర్షని అద్దుకోకుండా కాగితానికి రంగులు వేసినంత మాత్రాన కరెన్సీ కాదన్న ఇంగితాన్ని కాలాన్ని చూసైనా నేర్చుకుందాం! మౌనాన్ని ఆశ్రయిస్తే సత్యం తెలుస్తుందని చిరునవ్వును ప్రయోగిస్తే పరిష్కారం దొరుకుతుందని గుర్తుచేసుకుందాం! మంచికాలం అంటే మనం పది మందితో కూర్చోటం కాదు పది మంది మనతో కూర్చోవాలనుకోవటం! ఇప్పటిదాకా మనకు తెలిసినవి త్రికాలాలే భూత భవిష్యత్ వర్తమాన కాలాలే కనిపించని నాలుగో కాలమే విశ్వ కాలం ఆ కాలంలోకి ఇంకిపోదాం ఆ కాల లోకం లోకి అదృశ్యమవుదాం ఓ విశ్వా వసూ! మేమూ వస్తున్నాం నీ పుష్పక విమానంలో మాకూ కాస్త చోటివ్వు! ప్రపంచాన్ని నీతో కలిసి చుట్టెయ్యనివ్వు!
ముందున్నది మరణమేనని తెలిసినా ఇవాళ ఒక యుగాన్ని నాటాలి గమ్యం అగమ్యమే అయినా చూపులనే పాదముద్రలు చేయాలి
ఈ క్షణపు నందివర్ధన పరిమళం తెలిమంచులా మనసును చుట్టుకొని కాలంలోకి వ్యాపించడం ఒక నమ్మిక
కలత నీడను నవ్వు కమ్మినట్టు రాబోయే క్షణం స్వాగతించడం ఒక ముందడుగు
రాత్రి దారులు కూలే ముందు చేతి తడుములాటకు తగిలే చీకటి ఒక దారిదీపం సుడిగుండాల గిరికీలు దాటి తీరం తాకే శిథిల ఓడ గాలి తొడిగిన నవ్వు వెక్కిళ్లలో కొత్త చివుళ్ల నీటి గుటక జాడ చేరిన అనూహ్య మజిలీలో గమనం ఒక కొత్త బస నిన్న ఒక గుయ్యారమే ఐనా ఆ చివార్న ఓ వెలుగు ద్వారం
రంధి నిండిన ఊయల మెలకువకు ధ్వని బీభత్సమూ మౌనమే
కలిసిరానట్టు గడిచిపోనట్టు కాలం నటిస్తుందే కానీ అది చీకట్లోనూ వెలిగే నీడ గుండె ఖాళీ అనిపిస్తుందే కానీ అది క్రిక్కిరిసిన అనుభవాల ఆక్రమణ కలల కబ్జా బతుకు ఎండావానాకాశంలో ఇంద్రధనువు మౌనం అనర్గళం దుఃఖపు జాతరలో విశ్వాసాల వేడుక కోలాహలం
రేపంటే నిన్నకు స్క్రీన్ప్లే మారిన సీక్వెల్?
జీవితాన్ని నువ్వు స్థిరీకరిస్తావో లేక జీవితం నిన్ను స్థిరీకరిస్తుందో తెలియదు గానీ ఒక్కోసారి తొలి పూవేదో నీ అడవి గుండెల పైన అప్రయత్నంగా వికసిస్తుంటుంది అది చమురును బ్రతికించగలిగే దీపమవుతుంది అనేక అనుభూతులు కలగలిపిన కవిత్వం లాంటి పచ్చడి ఉగాదై పలకరిస్తుంది తీరాలు దాటుతూ వచ్చిన సముద్రం ఆవలి గట్టయితే ఇంకా కనుక్కోలేదు వేషాలు మారుస్తూ వచ్చిన దినదీపానికి అస్తమయ అనుభూతి అర్థం కావడం లేదు చీకటి మ్రాను శరీరం మీద చివురై మొలిచిన చందమామ నల్లటి శరీరంతో తెల్లగా పాడుతున్న కోకిలమ్మ అంతరించిపోయిన నిన్నటి నుంచి మళ్లీ మొలుస్తున్న నేటి చెట్టు ఇట్లా ఎంత సందేశం దాచుకుంది ఉగాది ఓటమి పునాదులే గెలుపు గోడకు హేతువులవుతాయి దూరంగా కనిపించిన అగాథం మహా ప్రస్థానంలో దగ్గరికి వచ్చేసరికి జీవకళలు పరుచుకున్న నేల అవుతుంది విశ్వావసు ఒక్కసారి వీర గంధమై పలకరిస్తుంది ఉగాది అంటే మృతి నుంచి మొలుస్తున్న ప్రాణధనం ఉగాది అంటే నిరాశ నుంచి తల ఎత్తిన విజయ సోపానం… పంచాంగ శ్రవణం..!
ఎండుటాకుల బాధలు చూస్తూనే
శిశిరం వెళ్లిపోయింది
ఎగతాళి చేస్తూనే..!
కాలం నిత్యం
ఓ మలుపుల ఇంద్రధనస్సు
వసంతపు ఇంటి తలుపులకు
స్వాగత మార్పు తోరణాలు కట్టింది..!
జీవితం ఓ నిత్య
నూతన మహా ప్రవాహం
గెలుపోటముల మజిలీలను
మనమంతా దాటి పోవాల్సిందే..!
గమనం సృష్టి లక్షణం
నువ్వు ఆగలేవు
నిన్ను ఎవ్వరూ ఆపలేరు..!
చిగురిస్తున్న బ్రతుకు
ఆశల చెట్లను చూస్తూ ఆకాశం
ఓ తెల్లని కాగితం అయ్యింది
వికసిస్తున్న
పువ్వుల వెలుగుల మధ్య
కోయిల గానం నా కవిత్వం అయ్యింది
ఋతువులు తమ రూపురేఖలను
మార్చుకున్నట్లే నీ ఆలోచనల రహదారిపై
నీ అనుభవాల ప్రయాణంలో
నువ్వూ అప్డేట్ కావాలి..!
నిరంతరం శోధించి సాధించాలి..!
టీవీలో విన్నావుగా
రాతల ఉగాది పంచాంగ శ్రవణం
ఇప్పుడు నేను చెప్పింది
నీ చైతన్యపు చేతల
యుగాది పంచాంగ శ్రవణం..!
నువ్వే రాకెట్లా
నీలో నువ్వే
ఆలోచనల అగ్నిగోళంలా మండుతూ
నీ జీవన అంతరిక్షంలోకి దూసుకుపో..!
అనుకున్నవన్నీ జరగవు
అనుకోలేదని ఆగవు
సునీతా విలియమ్స్ నవమాసాల
అంతరిక్ష యానం
చూసాము కదా
మనమంతా..!
నీ ఆత్మ విశ్వాసపు శోభతో
గెలాక్సీల గమనపు దిశలను
అనంత విశ్వపు
రహస్యాలను
నీ అరచేతిలో
చాపలా చుట్టేసేయ్…!
బహుశ ఎప్పుడో భూమ్మీద కురిసిన
మొదటి వాన చినుకు ప్రతిధ్వని
మైదానాల పంటల మీది పాటలై
తీరాన జాతరలై కుంభమేళాల కోలాహలాలై
రంగులను ధరించి, రంగుల గోళాలై తిరిగి
రంగుల విశ్వాలై విస్తరించి
రంగుల శబ్దాలతో నర్తిస్తూనే.. నర్తిస్తూనే…
శబ్దాల రంగుపొరలు ఒక్కొక్కటీ విప్పేసి
శూన్యంలోకి జారవిడుస్తూ..శూన్యంగా మారి
గుహలోపలి నాదం మీద చంద్రకాంతిగా నిద్రపోతుంది
కాలమే పిలుస్తుందో!, లేక
కాలం వెలుపల పారేసుకున్న ధ్వని తరంగాలు పిలుస్తాయో!
లేక, తరంగాల్లోని స్మృతులే పిలుస్తాయో!
లేక, స్మృతులకు అంటిన
తల్లిపేగు వాసనలే మేల్కొలుపుతాయో!
గుహలోంచి ఒక కొత్తశబ్దం లేచి వళ్లు విరుచుకుంటూ కళ్లు తెరుస్తుంది గుడ్డులోంచి పిల్ల బయటికొచ్చినట్లు గుహని పగలగొట్టుకుని వచ్చి అడవిలో తిరిగిన శబ్దం పిట్టని నిమిరి పాటై పోతుంది పశువుని నిమిరి అరుపు అవుతుంది మృగంతో కలిసి గర్జిస్తుంది మనిషితో కలిసి మాటై పోతుంది మాట మనుషుల్ని కావలించుకుని సామూహికమవుతుంది మనుషులు చూసిన కొత్త దృశ్యాల్లో ఈదిన మాటలు కొత్త కళ్లు తెరిచి కొత్తలోకాలు చూపిస్తాయి మనుషుల మీద ప్రేమ నిండిన మనుషులు తమ గుండెల కాగడాలు వెలిగించి నడిచినప్పుడు శబ్దం అనంత కాంతిగా మారిపోతుంది. పాలపుంతలో వెలిగే శబ్దం మీది హిమ పంక్తుల్లో తొలిచినుకు ప్రతిధ్వనించే వాగర్థాల తాండవం విభ్రమ గొలిపే విశ్వకావ్యం బహుశా ప్రకృతి మాత ఆనందాశ్రు కవనం
రుతువులు రుతువులుగా కాలచక్రం
కాలాలు కాలాలుగా ప్రకృతి ప్రయాణం
క్రమ క్రమంగా గిరగిర తిరిగే గమనం
ప్రభవ నుంచి అక్షయ దాకా ఇదే కొలమానం
విశ్వావసు ఇప్పుడు కనిపిస్తున్న మైలురాయి
మనుషుల పర్యావరణ విధ్వంసం తప్పితే
ఎల్లకాలం సమయానుక్రమ పత్రహరితం
పచ్చని బీర పూలు పూసే సమయాలు
పుల్లటి చింతకాయ దులిపే వేళలు
తియ్యటి మామిడి పూతల శీతల గాలులు
మల్లెపూల సరస పరిమళాలు
మోదుగు పూల ఎర్రెర్రని సోయగాలు
సృష్టి స్వభావమే కాలానుగతి సూత్రం
ఆయిటి పూని చినుకులు రాలంగనే
చెట్టూ చేమా పచ్చని పలకరింపులు
గలగలా గడ్డి పరకల నవ్వుల కాలం
రగ రగ ఎండలు బగ్గున మండంగనే
భూతలమంతా నిప్పుల కుంపటి వేడిమి
చెరువులు కుంటలు నెర్రెలు ఇడిసే కాలం
గజ గజ చుట్టుకున్న ఇగం భయం
ఎటు చూసినా ముడుచుకున్న దేహాలు
గడ్డ కట్టే చలి పులికి వణికి పోయేకాలం
నిరంతర చలనాల్లోనే కాల యవనిక నడక
ప్రకృతి తనకు తానుకు తిరిగి పునరాకృతి
కాలాలు కాలాలుగా పండుగల సంస్కృతి.
కొత్త సంవత్సరం పాత బంగారంలా చింతతోపుతొర్రలో చిలుకలు ఎర్రముక్కులతోతలపెట్టి బయటకు చూస్తున్నట్లు విరగకాసిన మామిడి తోటల్లో జుంటి తేనెటీగలు రాగాలు పోతున్నట్లు సజ్జ జొన్నకంకులపై ఊరపిచుకలు వాలుతున్నట్లు కాలమంతా పూచిన కలల పూల కాలమైన్నట్లు కుంటలు చెరువులు ఆకలి తీర్చే వర్ష ఋతువు మేఘాల కడవలతో నింపుతున్నట్లు నేల రైతు పాడి పచ్చగా పరవశిస్తున్నట్లు కనుల ముందు పురివిప్పిన నెమలి నాట్యంలా కాలం సోయగాలు పోతుంది…
సమస్యలు సామరస్య ధోరణితో యుద్ధాన్ని శాంతిపూల తోటగా విశ్వకుటుంబం ఒకటిగా తన ఆలోచనల రథం నడిపే వాడే కాలానికి ఉగాది నాయకుడు శ్రీ విశ్వావసు సంవత్సరానికి వక్త ప్రవక్త…
ఆ.వె. ॥ విభవ మిడగ వచ్చె విశ్వావసువు నేడు
సత్కరించ రండు సకల జనులు
పచ్చడింత పంచి పండుగ చేయుడు
పిల్ల పాపలెల్ల సల్ల గుండ.
ఆ.వె. ॥ హిందు ధర్మమంత విందులు జేయుచు
అరుక చేత బట్టి యవని దున్ను
హాలికులము నేడు కలిసి యానందాన
పిలుచుచుండ్రు నీకు పలుక శుభము
ఆ.వె. ॥ కొత్త వర్ష మనుచు కోటి యాశలతోడ
సకల జనులు నిన్ను స్వాగతింత్రు
కొలిచి నట్టి జనుల కోరిక తీర్చుమా
వందనా లొనర్తు వరములిమ్ము
ఆ.వె. ॥ కల్ల కపట మింత కల్మషమే లేని
ఆడవారు నీకు హారతులను
పట్టి పిలుచునట్టి పండుగ యిది కదా
జనుల యాశ తీర్చ సంతసింత్రు.
కొమ్మ కొమ్మన కమ్మ కమ్మగ కోకిలమ్మలు కూయగా
ఝుమ్ము ఝుమ్మని పూలపై మధుసూదనమ్ములు నాడగా
రమ్ము రమ్మని మంజరుల్ ఘన రాగ రమ్యత గూర్చగా
మిమ్మటంబుగ కౌసుమమ్ము సమీర మందున తేలగా
గున్న మామిడి పూచెనే ప్రతి గూడె మందున మెండుగన్
చిన్నగా చిలకమ్మ నవ్వెను చిందులేయుచు పొందుగన్
తిన్నగా తెరయీగ లన్నియు తేలియాడెను తోటలోన్
వన్నెగా ప్రతి వేప మారెను వత్సరాదిన పూలతోన్
వెచ్చ వెచ్చగ వీపుతట్టుచు వేడిగాలులు వీచగన్
పచ్చ పచ్చని చూతకమ్ముల పక్షిమూకలు చేరగన్
వచ్చె వచ్చె వసంత మాసము వన్నె చిన్నెలు చిల్కుచున్
తెచ్చె తెచ్చెన్ తేట తేనెలు తీపి తీవ్రత పెంచుచున్.