తిరుపతి : టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ( Hindu Dharma Prachara Parishat ) ఆధ్వర్యంలో తిరుపతిలోని వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షర గోవిందం-అన్నప్రాశనం ( Akshara Govindam-Annaprasanam ) కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర పాల్గొని చిన్నారులకు ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, అక్షరాభ్యాసం, అన్నప్రాశనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలు అని పేర్కొన్నారు. తొలి అక్షరం ‘గోవింద’ నామంతో ప్రారంభమైతే విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు.
అనంతరం ‘అక్షర గోవిందం కిట్’ను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్షతో పాటు పూజా, విద్యా సామగ్రి ఉన్నాయని వివరించారు. అనంతరం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన యాత్రికుల నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించారు.