ఎండలు ఎక్కువయ్యాయి. వానలు కరువయ్యాయి. అందుకని ఊర్లోని వాళ్లు ప్రవచనకర్తను పిలిపించి మహాభారతంలోని విరాట పర్వం చెప్పించాలనుకున్నారు. విరాట పర్వం చెప్పిస్తే మంచి వానలు కురుస్తాయని వారి విశ్వాసం. ఊళ్లో రాములవారి గుడి దగ్గర ప్రతి రోజూ సాయంత్రం ప్రవచన కార్యక్రమం ఏర్పాటుచేశారు. వారం రోజుల కార్యక్రమం అది. విషయం విన్న ఆ ఊర్లోని ఓ దర్జీ మొదటిరోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలయ్యింది. నిద్రపోబోతూ ఉంటే దగ్గుతున్న తాత ‘తెచ్చింది పెట్టెలో పెట్టి పడుకో!’ అన్నాడు. ఆ దర్జీకి ఏమీ అర్థం కాలేదు. నిద్ర మత్తులో ఉన్నాడేమో తాత అని గమ్మున ఉండిపోయాడు. రెండో రోజు కూడా పడుకోబోయే ముందు తాత ‘తెచ్చింది పెట్టెలో పెట్టి పడుకో!’ అన్నాడు. ‘నేనేమీ తీసుకురాలేదు కదా, పెట్టడానికి మన ఇంట్లో అసలు పెట్టే లేదు కదా! తాతకు చాదస్తం ఎక్కువయ్యింది’ అని తిట్టుకుంటూ పడుకున్నాడు దర్జీ. మూడో రోజు సాయంత్రం నుంచి వర్షం మొదలైంది.
కార్యక్రమం అంతా అయ్యాక వానలో తడుస్తూనే ఇంటికి చేరాడు దర్జీ. ఆరోజు కూడా తాత అదే మాట అన్నాడు. ఇక తాడోపేడో తేల్చుకోవాలనిపించింది దర్జీకి. ‘నేనేం తెచ్చానని పెట్టెలో పెట్టమంటావు? అసలు పెట్టె ఎక్కడ ఉంది మన ఇంటిలో?’ అని గట్టిగా నిలదీశాడు. దగ్గుల తాత నవ్వుతూ ‘నాయనా… రోజూ బాగా అలంకరించుకుని టింగురంగడిలా విరాట పర్వం వినడానికి వెళ్లి వస్తున్నావు. మనం అక్కడికి వెళ్లేది నాలుగు మంచి విషయాలు తెలుసుకోవడానికి. ఆ మంచిని ఒక చెవితో విని మరో చెవితో వదిలి వేయకూడదు. దాన్ని మన ‘మనసు’ అనే పెట్టెలో పెట్టాలి. రోజువారీ వ్యవహారాల్లో ఆ మంచిని పాటించాలి. నీవు వింటున్న విషయాల్లో కొన్నయినా నీ మనసులోకి తీసుకుంటున్నావా లేదా… అదే విషయాన్ని అలా అడుగుతున్నాను’ అని బదులిచ్చాడు. ‘నిజమే… విని తెలుసుకోవడం వేరు. దాన్ని ఆచరించడం వేరు’ అని గుర్తించిన దర్జీ ఆ రోజు నుంచీ మరింత జాగ్రత్తగా ప్రవచనాన్ని వింటూ అనేక మంచి విషయాలు తెలుసుకుని ఆచరించడం ప్రారంభించాడు.