దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి!
(భగవద్గీత – 2- 13)
‘జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరొక దేహప్రాప్తి (మరణము) కలుగుతుంది. ధీరుడు అంటే ప్రాజ్ఞుడైనవాడు ఈ విషయం పట్ల మోహితుడు కాడు’ అని అంటున్నాడు కృష్ణపరమాత్మ. ప్రకృతిలో మార్పు ఎలాగైతే సహజమో… శరీరానికీ మార్పు సహజమే. ‘దేహే’ అనడం వల్ల అది శరీరానికే పరిమితం గాని ఆత్మకు కాదని స్పష్టమవుతున్నది. ఒక అవస్థ నుంచి మరొక అవస్థకు చేరడం మార్పు. మొదటి మూడు అవస్థలకు బాధపడని మనిషి మరణం సమయంలో మాత్రం బాధపడతాడు.
ప్రతి వ్యక్తిలో రెండు శక్తులు ఉంటాయి. ఒకటి పురుషశక్తి, రెండోది స్త్రీశక్తి. పురుషశక్తి సృజనాత్మకతకు సంబంధించినది కాగా.. స్త్రీ శక్తి పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణానికి సంబంధించినది. వ్యక్తి విజయాన్ని సాధించాలంటే స్త్రీ-పురుష శక్తులను రెండిటినీ సమన్వయం చేసుకోవాలి. ఎదురయ్యే పరిస్థితులను అవగాహన చేసుకోవడం, అంగీకరించడం వల్ల మనసుకు కలిగే ఒత్తిడిని అధిగమించి సరైన విధంగా స్పందించే అవకాశం ఉంటుంది. చాలామంది మనసులలో ఒకలాంటి బిరుసుదనం ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ఇష్టపడరు.
మారనని భీష్మించుకొని కూర్చునే మానసికస్థితిని, అరక్షితమైన వలయంలో తమను తాము బంధించుకునే తత్వానికి ప్రతీకగా చూడాలి. అలాంటివారు కొన్ని పూర్వ నిశ్చితాభిప్రాయాలను ఏర్పరచుకొని, ఆ కోణంలోనే ప్రపంచాన్ని చూస్తూ.. ఆ పరిధిని అతిక్రమించేందుకు అంగీకరించరు. ఆ అభిప్రాయాలకే బందీలవుతారు. యదార్థ స్థితికి.. మన అభిప్రాయాలకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు సంఘర్షణ అనివార్యం అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా సామరస్యతను సాధించగలిగితే జీవితం ప్రశాంతతను సంతరించుకుంటుంది.
ఆలోచన చేయడం, అనుభూతిని పొందడం, అవగాహన చేసుకోవడం.. ఈ మూడూ మూడు స్థాయులలో అర్థం చేసుకోదగిన అంశాలు. కానీ, సాధారణంగా ఎక్కువమంది ఆలోచనా స్థాయిలోనే ఆగిపోయి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ కోణం నుంచే సమస్యను చూస్తారు కాబట్టి వారిలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది సంఘర్షణకు దారితీస్తుంది. ఎదురుగా నిలిచిన పెద్ద వటవృక్షాన్ని సైతం కూల్చివేసే ప్రవాహవేగానికి తలొగ్గిన పబ్బలి చెట్టును ప్రవాహం ఏమీ చేయలేదు. ప్రవాహం తగ్గాక పబ్బలి చెట్టు మళ్లీ తలెత్తుకు నిలుస్తుంది. ఎప్పుడైతే సన్నివేశం మనకు ప్రతికూలంగా మారుతున్నదో దానిని ఎదిరించకుండా దానిని మనకు అనుకూలంగా మార్చుకునే ఆలోచన చేయాలి. అంటే ఆలోచన విస్తృతం కావాలి. అప్పుడది సానుకూలమవుతుంది. దానినే చాతుర్యం అంటారు. నిజానికది చెప్తే వచ్చేదికాదు.. ఆ నైపుణ్యాన్ని పట్టుకోవాలి.
మార్పు అనేది జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా సహజప్రక్రియ. మారనని భీష్మించుకు కూర్చుంటే సమయమే మనలను మారుస్తుంది. అవసరాన్ని గుర్తించి.. మార్పునకు సన్నద్ధమవ్వాలి. మారకపోతే ఎదురయ్యే ప్రమాదాలను, లాభనష్టాలను గుర్తించాలి. సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దాని ప్రకారం మార్పును ఆహ్వానించాలి. ప్రణాళికను నిబద్ధతతో అమలుచేయడం, నిర్దిష్ట కాలావధిలో దానిని సమీక్షించుకోవడం.. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం వల్ల కాలానుగుణంగా మారడం సులువు అవుతుంది.
అరవై సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తి స్విమ్మింగ్‌పూల్‌లో నీటిపై తేలుతూ ఆనందిస్తాడు.. కానీ, ధ్యానంలో పది నిమిషాలు కూర్చోవాలంటే కాళ్లు నొప్పులంటాడు. ఆ వ్యక్తి మారడానికి ఇష్టపడక తనకు తానుగా ఇచ్చుకున్న స్వయం సూచనలకు అనుగుణ ఫలితాలే. కొడాక్, బ్లాక్ బస్టర్, హెచ్‌యంటీ, మర్ఫీ రేడియో, అంబాసిడార్.. తదితర సంస్థలు ప్రపంచ మార్కెట్‌ను ఒకనాడు శాసించినా.. మార్పును అవగాహన చేసుకోలేక.. ఆహ్వానించలేక చతికిలపడ్డాయి. అందుకనే కృష్ణపరమాత్మ ‘సహజ ప్రక్రియయైన మార్పును అంగీకరించండి, ఆహ్వానించండి.. ఆనందంగా జీవించండి’ అని అర్జునుడికే కాదూ, మనకూ ఉపదేశించాడు.
– పాలకుర్తి రామమూర్తి