ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొరికింది తిని, గ్రామాల్లోని గుడుల్లో విశ్రమించేవాడు. ఎంతోమంది గ్రామస్థులు అతని మంచి మాటలకు ప్రభావితమై తమ చెడ్డ అలవాట్లను విడిచిపెట్టారు. అలా మారిన వారు ఎంతో సంతోషపడి గురువుకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే, ఈ ప్రయాణంలో కొంతమంది పాత మార్గాన్నే అనుసరించడాన్ని శిష్యులు గమనించారు. అదే విషయం నేరేడు చెట్టు కింద కూర్చుని ఉన్న గురువుకు బాధగా చెప్పారు. గురువు నవ్వుతూ ‘బిందెకు సొట్ట పడిందనుకోండి, ఏం చేస్తాం?’ అని అడిగాడు. ‘నైపుణ్యంతో ఆ బిందె సొట్టను తొలగించగలం’ అని బదులిచ్చారు శిష్యులు. వెంటనే గురువు ‘అదే మట్టికుండకు సొట్ట పడితే తొలగించగలమా?’ అని అడిగాడు. ‘అది సాధ్యం కాదు. తొలగించే ప్రయత్నం చేస్తే, అసలు పనికి రాకుండా పోతుంది’ అని బదులిచ్చారు. ‘అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చెయ్యాలి. అంతేకానీ, అందరినీ మార్చాలనుకోవడం అవివేకం అవుతుంది. కాబట్టి మారని వారి గురించి ఆలోచించొద్దు.
అహంకారం కొద్దీ కొందరు, మూర్ఖత్వం కొద్దీ మరికొందరు, ధన మదం కొద్దీ ఇంకొందరు మిడిసిపడుతుంటారు. ఎదుటివారిని అవమానించి ఆత్మద్రోహం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిపై జాలిపడాలి. వ్యాధి బాధితులుగా భావించి, వారి రుగ్మత నయం కావాలని దైవాణ్ని ప్రార్థించాలి. అంతేకానీ, ఈ మారని మూర్ఖుల కోసం మన ప్రయత్నం మానుకుంటే.. వేరే వాళ్లు కూడా మారరు కదా!’ అన్నాడు గురువు. గురువు చెప్పింది తమకు అర్థం కానట్టుగా ముఖం పెట్టారు శిష్యులు.
‘ఈ నేరేడు చెట్టునే చూడండి, తన నేరేడు చెట్ల జాతి అభివృద్ధిలోకి రావాలని వేలాది నేరేడు కాయలను కాస్తుంది. వాటిలో కొన్ని మాత్రమే నేరేడు చెట్లు అవుతాయి. మిగిలినవన్నీ వృథా అవుతాయి. అయినా అది కుంగిపోదు. ఈ భూమి అంతా నేరేడు చెట్లమయం కాలేదని అది కాయల్ని పండించక మానదు. అలాగే మనం కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మన దారిలోకి కొందరు వస్తారు, కొందరు రారు’ అని వివరించాడు. గురువు మాటల్లోని ఆంతర్యం తెలుసుకున్న శిష్యులు మరో ఊరికి నీతి బోధనలు చేయడానికి గురువుతో కలిసి ప్రయాణమయ్యారు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821