ఒక వ్యక్తి ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా లంకెబిందెలు దొరికాయి. ఇల్లు అమ్మిన వ్యక్తిని కలిసి, ‘సోదరా! నువ్వు అమ్మిన ఇంట్లో బంగారు బిందెలు దొరికాయి. అవి నీకే చెందుతాయి. నేను ఇల్లు కొన్నాను కానీ, నేలలో ఉన్న లంకెబిందెలు కాదు కదా!’ అని చెప్పాడు. దానికి ఇల్లు అమ్మిన వ్యక్తి ‘ఆ బిందెలు నీ సొత్తు! నేను ఇంటిని అమ్మేశాక.. అందులో కలప, సామగ్రి అన్నీ నీకే చెందుతాయి’ అన్నాడు. ఇద్దరూ ‘ఆ సొత్తు నీదంటే నీదంటూ’ వాదులాడుకున్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామంలోని పండితుడి దగ్గరికి వెళ్లారు.
ఇద్దరి మంచితనం గమనించిన పండితుడు ఇద్దరితో ‘మీకు ఎంతమంది పిల్లలు?’ అని అడిగాడు. ఇల్లు అమ్మిన వ్యక్తి తనకు కూతురుంది అన్నాడు. కొన్నవ్యక్తి కొడుకు ఉన్నాడు అన్నాడు. అప్పుడు పండితుడు ‘పరాయి సొమ్ము ఆశించని మీరిద్దరూ గొప్పవ్యక్తులు. మీ బిడ్డలకు పెండ్లి జరిపించి, ఈ బంగారం ఆ నవదంపతులకు ఇవ్వండి’ అని తీర్పు చెప్పాడు. ‘ఒకరి సొమ్మును అన్యాయంగా కబళించకండి’ అని ఖురాన్ సూక్తి. పంపకాల్లో అయినా, వ్యాపార లావాదేవీల్లో అయినా ఈ సూత్రానికి కట్టుబడితే ఏ సమస్యా ఉండదు.