‘భక్తియోగో నిరుపద్రవః, భక్తియోగాన్ముక్తిః’ అంటుంది త్రిపాద్విభూతి మహా నారాయణ ఉపనిషత్తు. అంటే ‘భక్తి యోగం నిరపాయకరమైనది. దీనితో ముక్తి లభిస్తుంది’ అని భావం. ఈ ఉపనిషత్ వాక్యానికి కింద పేర్కొన్న కథ భాష్యంగా కనిపిస్తుంది. పూర్వం కాంచీపురాన్ని చోళచక్రవర్తి పాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఆర్భాటంగా ఖర్చుపెట్టి ఎన్నో యజ్ఞాలు చేసేవాడు. ఒకనాడు సువర్ణ పుష్పార్చన చేశాక గుడికి ‘విష్ణుదాసు‘డనే బ్రాహ్మణుడు వచ్చి, తులసి దళాలతో దేవుణ్ని పూజించాడు. ఇది రాజుకు నచ్చలేదు. ఇదేం పూజ అన్నాడు. బ్రాహ్మణుడూ కోపించి, ‘నీకు భక్తి లేదు.‘ అన్నాడు. చోళరాజు వెటకారంగా ‘నేనెన్ని క్రతువులు చేశానో తెలుసా! ఎవరు ముందు విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతారో చూద్దాం’ అనే ముద్గలుడనే ముని ఆధ్వర్యంలో గొప్ప విష్ణుయాగం సంకల్పించాడు. బ్రాహ్మణుడు దీక్షగా కార్తీక వ్రతం, షోడశోపచార పూజలు, కీర్తనలతో ఆరాధించసాగాడు.
ఒకనాడు విష్ణుదాసుని ఆహారాన్ని ఒక దొంగ అపహరించాడు. వరుసగా వారం రోజులూ అలాగే జరిగింది. విష్ణుదాసునికి అన్నం లేదు. అయినా దైవారాధన మానలేదు. ఒకరోజు దొంగను కనిపెట్టాలని నక్కి కూర్చుంటే ఒక చండాలుడు వచ్చాడు. అస్థి పంజరం లాంటి శరీరం. ఆకలితో ఆరాటం. బ్రాహ్మణుడెంతో బాధపడ్డాడు. వాడు ఆహారాన్ని దొంగిలించుకొని పోతుంటే.. ‘ఆగవయ్యా! కేవలం అన్నం ఎలా తింటావు? ఈ నెయ్యి కూడా కలుపుకొని ఆరగించు’ అని దొంగ వెంటపట్టాడు విష్ణుదాసుడు. భయంతో వాడు పారిపోతూ ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. విష్ణుదాసుని సపర్యలతో తేరుకున్న చండాలుని స్థానంలో శ్రీహరి సాక్షాత్కరించాడు. బ్రాహ్మణుడు కన్నులారా దర్శించి ‘నారాయణా! కరుణించావా స్వామీ! నేయి వేసుకుని కడుపారా భుజించు’ అని అన్నం ముద్ద నివేదించాడు.
శ్రీహరి ఆరగించాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. శ్రీహరి విష్ణుదాసుని కౌగలించుకొని, సారూప్యాన్నిచ్చి, వైకుంఠానికి బయల్దేరమన్నాడు. చోళరాజు ఇది చూడగలిగాడు. ముద్గలునితో ‘మహర్షీ! నిరుపేద విప్రుడు వైకుంఠానికి వెళ్తున్నాడే! ఐశ్వర్యం ఉండి, గొప్ప యజ్ఞాలు చేసి, భూరి దానాలు చేసినా నాకు ఏ లాభం లేకపోయింది. భగవంతుడిని చేరేందుకు భక్తి తప్ప మరొకటి లేదని తేలింది’ అంటూ యజ్ఞాన్ని వదిలేసి హరినామ స్మరణతో హోమాగ్నిగుండంలో దూకాడు. చోళరాజును శ్రీహరి అక్కున చేర్చుకొని గుండం నుంచి వెలువడ్డాడు. అతనికీ సారూప్యాన్నిచ్చాడు. తనతోపాటే వైకుంఠానికి కొనిపోయాడు. నిష్కల్మషుడైన భక్తుణ్ని భగవంతుడు ఎన్నటికైనా అనుగ్రహిస్తాడని పై కథ తెలియజేస్తుంది. ఆ భక్తుడు పేదవాడా, పెద్దవాడా అన్న మీమాంస దేవుడికి ఉండదు.
(ఇవి కార్తీకపురాణం 51,52వ అధ్యాయాలు. 26 వ రోజు పారాయణం చేస్తారు)
…? డా॥ వెలుదండ సత్యనారాయణ