అవతరణ అంటే దిగి రావటం, వచ్చి కంటికి కనబడటం. కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై ఒక రూపాన్ని ధరించి, అధర్మాన్ని అణచి, ధర్మ పరిరక్షణ చేయటమే ఏ అవతారి లక్ష్యమైనా. అవతార లక్ష్యం పూర్తయ్యాక ఆదర్శ మూర్తులుగా జనం నీరాజనాలు అందుకుంటారు దైవాలు. అలా పిల్లల, పెద్దల, యోగుల, సాధకుల దైవంగా అందరినీ అనుగ్రహించే అద్భుత అవతారం నరసింహం.
ధర్మాన్ని స్థాపించడానికి, భక్తులను రక్షించడానికి భగవంతుడు అనేక అవతారాలను స్వీకరిస్తాడు. వాటిలో శ్రీ నరసింహ స్వామి అవతారం అత్యంత విశిష్టమైనది. భక్త ప్రహ్లాదుని కోసం ప్రత్యక్షమైన ఈ దివ్య అవతారం భక్తి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. గర్భంలోనే నారద మహర్షి ఉపదేశంతో విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, ఎన్నో హింసలు ఎదురైనా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అగ్ని, పర్వతం, పాములు వంటి ప్రమాదాల నుంచి భగవంతుని కృపతో బయటపడ్డాడు. తనని నమ్ముకున్న ప్రహ్లాదుని రక్షించేందుకు సాక్ష్యంగా స్వయంగా శ్రీహరే స్తంభం నుంచి నరసింహుడై అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అనంతరం ప్రహ్లాదునికి వరాలు ప్రసాదించి ప్రహ్లాద వరదగా ప్రసిద్ధి చెందాడు. ఈ కథ భక్తి, ధైర్యం, వినయం మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు, హిరణ్యకశిపుని సంహరించేందుకు స్వామి సగం మనిషి, సగం సింహం రూపంలో స్తంభం నుంచి ఆవిర్భవించారు. మృగరాజు సింహం అయినందున ఈ నరసింహ లీలకు మృగేంద్రలీల అని కూడా పేరు. ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం..’ అంటూ పూజలు అందుకునే ఆ దేవదేవుడు ‘ఉగ్రం వీరం మహావిష్ణుమ్ జ్వలంతం సర్వతో ముఖమ్’ అనేలా ఉగ్రరూపాన్నీ ప్రదర్శించగలడని తెలిపేది నృసింహ లీల. వేల సంవత్సరాల కఠోర తపస్సును ఆచరించే మునులకు సైతం ప్రసన్నుడు గాని ఆ పరంధాముడు ఐదేళ్ల పసిపిల్లవాడి కోసం తరలి రావటంలోని ఆంతర్యాన్ని తెలిపే పరమ పావనమైన లీల శ్రీనృసింహ ఆవిర్భావ లీల. భగవంతుడు తన భక్తుల మాటను, సత్యాన్ని నిలబెడతాడని నిరూపించడమే ఈ అవతార ముఖ్య ఉద్దేశం.
ప్రహ్లాదుడు తన తల్లి కాయాదు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి చేసిన ఉపదేశాలను ఏకాగ్రతతో విన్నాడు. ఈ దివ్య జ్ఞానం వల్లనే ఆయన పుట్టుకతోనే మహాభక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు తన తోటి బాలురకు ‘కౌమార ఆచరేత్ ప్రాజో’ (అనగా తెలివైన వాడు ఐదేళ్ల ప్రాయం నుంచే భక్తిని ఆచరించాలి) అని సందేశాన్ని ఇచ్చాడు. బాల్యంలో మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి, ఆ వయసులోనే భగవంతుడి పట్ల అనురాగాన్ని పెంచుకోవడం సులభమని ఆయన బోధించాడు.
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు. ఈ తొమ్మిదింటిలో ఏ ఒక్కటి చిత్తశుద్ధితో ఆచరించినా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. నేటి సమాజంలో హరేకృష్ణ మహా మంత్రాన్ని కీర్తించడం (కీర్తనం), భగవంతుని లీలలను వినడం (శ్రవణం) ద్వారా మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చు.

హిరణ్యకశిపుని సంహారం తర్వాత, ప్రహ్లాదుడు స్వామిని అత్యంత వినయంతో, ప్రేమతో స్తుతించాడు. నరసింహ స్వామి ప్రహ్లాదుణ్ని వరాలు కోరుకోమన్నప్పుడు, ఆయన భౌతిక సంపదలను కాకుండా, తన తండ్రి చేసిన పాపాలను క్షమించమని కోరాడు. ఒక స్వచ్ఛమైన భక్తుడు కుటుంబంలో జన్మిస్తే, అతని కారణంగా 21 తరాల పూర్వికులు మోక్షాన్ని పొందుతారని స్వామి వరం ప్రసాదించారు.
శ్రీ చైతన్య మహాప్రభు సింహాచల క్షేత్రంలో వరాహ నరసింహ స్వామిని దర్శించి, ఈ మంత్రంతో కీర్తించారు: ‘శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ, ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ’. పద్మము వంటి ప్రహ్లాదుని ముఖాన్ని చూసి భ్రమరము (తుమ్మెద) లాగా స్వామి ఆనందిస్తారని దీని భావం. ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ దేవాలయాలలో నరసింహ స్వామిని ‘భక్త రక్షకుడిగా’, ‘విఘ్న వినాశకుడిగా’ ఆరాధిస్తారు. భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి, వారిని మాయ నుంచి కాపాడతారని విశ్వాసం. ప్రహ్లాదుని కథ నేటి యువతకు పట్టుదల, సహనం, నైతిక విలువలను నేర్పుతుంది. నిరంతరం భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా మనం కూడా ఆ నరసింహ కృపకు పాత్రులం కావచ్చు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే