సోమవారం 25 మే 2020
Devotional - Mar 21, 2020 , 22:50:17

వసంతోదయ వేళ..నమ: కాలాయ!

వసంతోదయ వేళ..నమ: కాలాయ!

వికారికి తప్పని వీడ్కోలు, శార్వరిపైనే ఆశలన్నీ

స్థలకాలాలను మించిన దైవం లేదు

యుగయుగాలుగా ఉగాది సంరంభాలు

ఎప్పటిలా వచ్చే కొత్త ఏడాదిలో కూడా ప్రజలకు వ్యాధుల బాధలు తప్పవని చెబుతూనే, మూడు దశాబ్దాల తర్వాత ఎన్నడూ లేని రీతిలో ఈసారి తెలంగాణ రైతులకు అత్యధిక పాళ్లలో పంటలు పండే అవకాశాలు పుష్కలంగాఉన్నట్లు మన పంచాంగకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

సృష్టికర్త సృష్టిని ప్రారంభించిన శుభదినం ఇదే మరి!

ఒకవైపు వాతావరణ మార్పులు, మరోవైపు మానవ కృత్రిమ విధ్వంసాలతో కాలం తన గతులను మార్చుకొంటున్నా మరోవైపు ఎప్పటిలా కొత్త ఆశలు, మరిన్నిఆకాంక్షలతో వసంతోదయం వేగిర పడుతూ వస్తున్నది. వేపపూతలు, మామిడి కాతలు, కోయిలల పాటలతో మొత్తంగా ప్రకృతి కొత్తందాలను పులుముకుంటున్న దృశ్యాలు మనసులకు ఎల్లవేళలా కనువిందు చేసేవే. అవి.. ఈ మధ్యకాలంలో ఎంతో అరుదైపోతున్నాయి. పట్టణాలు, నగరాలలో అయితే మరీను. ఎందుకీ పరిస్తితి? వేప, మామిడి వంటి దేశీయ చెట్లమీదికన్నా వట్టి బెండ్లవంటి విదేశీ చెట్ల పెంపకంపైనే మోజు పెరిగిపోతున్న ఫలితమిది కాదా! కొంచెం ముందు వెనుకైనా సరే, నవ వసంతం రాక తప్పదు. ‘కరోనా’ వంటి కాలవైపరీత్యాలు సామూహిక ఆరాధనలకు తాత్కాలికంగా ఆటంకాలు కలిగించినా వ్యక్తిగత స్థాయిలలో గృహారాధనలు ఉగాది వైభవాన్ని ఎప్పటిలా చాటుతూనే ఉంటాయి. ఈ వికారి సంవత్సరం వెళుతూ-వెళుతూ మరీ ఇంత ‘వికార’పు, దయనీయ దుస్థితిని ఎందుకు కలిగిస్తున్నట్టు? ఆరోగ్యదాయకమైన, సర్వశ్రేష్ఠమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాదని పాశ్చాత్య పోకడలతో, దూరపు కొండలకేసి పరుగులు పెట్టిన పర్యవసానం కాక మరేమిటి? వైఫల్యాలు నేర్పిన పాఠాలు, విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో వికారికి వీడ్కోలు చెబుతూ, భారమంతా రాబోయే ‘శార్వరీ’మాతపైనే వేయక తప్పని పరిస్థితి ఇది. 

భారతీయ ధార్మిక వ్యవస్థలో ఉగాది పర్వదినానికి వున్న విలక్షణత ఎంతో. పౌరాణిక ప్రాశస్త్యం మరెంతో. ప్రత్యేకించి ప్రకృతి, కాలధర్మాల ఆధారంగా ఒక ఋతుచక్రం ముగిసి మరొకటి మొదలవడానికి ఇదొక సంకేతం. ప్రతీ సంవత్సరం ఆకులు రాలడం (శిశిరఋతువు), మళ్లీ కొత్త చిగుళ్లతో పూతలు పూయడం (వసంతఋతువు) కాలకన్యకు సహజమే. కానీ, ఈ శార్వరికి ఒక ప్రత్యేకత ఉన్నది. కోట్లాది తెలంగాణ ప్రజలు కోరి తెచ్చుకొన్న ప్రత్యేక రాష్ట్రంలో కాళేశ్వరం జలాలు లక్షల ఎకరాల సేద్యపు భూములను సస్యశ్యామలం చేయబోతున్న అపురూప సందర్భమిది. దీని ఫలితాలనే పంచాంగకర్తలు పరిగణనలోకి తీసుకొన్నట్టున్నారు.పాశ్చాత్య సంస్కృతిలో ‘హాపీ న్యూ ఇయర్‌' (జనవరి 1)ను ఎంత వేడుకగా జరుపుకొంటామో అంతకంటే మించిన తాదాత్మ్యతతో, పవిత్ర హృదయాలతో తెలుగువాళ్లమంతా ఉగాది సంరంభాన్ని ఆస్వాదిస్తాం. పద్య, వచన కవుల కవితా గానాలు, కళాకారుల ఆటపాటలతో పండుగపూటంతా అనేక చోట్ల సారస్వత వైభవం పరచుకొంటుంది. ముఖ్యంగా కన్నడ, మరాఠా వారు కూడా మనలా చాంద్రమానం ఆధారంగానే ఈ చైత్రశుద్ధ పాడ్యమినే ‘ఉగాది’గా జరుపుకొంటారు. వసంత నవరాత్రుల శోభ, శ్రీరామనవమి వేడుక తీరు ఇంతా అంతా కాదు. దేశంలోని ఇతర రాష్ర్టాలు, ప్రపంచవ్యాప్తంగాగల ఆయా దేశాలలోనూ ప్రజలు తమకంటూ ఒక ప్రత్యేక రోజును ‘సంవత్సరాది’గా జరుపుకోవడం ఆనవాయితీ. ఎన్నో ప్రత్యేకతల ఉగాది ఈసారి మాత్రం మానవచరిత్రలోనే అత్యంత అరుదుగా ఇండ్లకు, కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతున్నది. కారణం, కరోనా! ఈ మహమ్మారిని తరమడమే లక్ష్యంగా యావత్‌ ప్రపంచం సామూహిక ప్రజాకూడళ్లను బహిష్కరిస్తున్న తీరు అసామాన్యం. తిరుమల, భద్రాచలం మొదలుగాగల అన్ని ప్రసిద్ధ దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలూ ఈ ఉగాది, వసంతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున జనసందోహాల రాకను రద్దు చేశాయి. ఇది కనీవినీ ఎరుగని పరిణామమే.

ఈ పండుగ ఎంత ప్రాచీనమైందంటే, గత అనేక కోట్ల ఏండ్లుగా మొత్తం సృష్టి ప్రారంభం నుంచీ దీనిని జరుపుకొంటున్నట్టు భారతీయ పౌరాణిక సాహిత్యం చెబుతున్నది. సృష్టికారకుడైన బ్రహ్మ ఈ రోజునుంచే సృష్టికార్యాన్ని ప్రారంభించినట్టు వేద విజ్ఞానులు చెప్తారు. మరోవైపు వేదాలను సంరక్షించాక, స్థితికారుడైన శ్రీమహావిష్ణువు వాటిని యధావిథిగా సృష్టికర్తకు అప్పగించిన రోజుగానూ దీనినే పేర్కొంటారు. ఈ ఘనమైన ప్రాశస్త్యం ఇంతటితో ఆగిపోలేదు. శాలివాహన చక్రవర్తి కూడా ఇదే పర్వదినాన పట్టాభిషిక్తుడైనట్టుగా చరిత్ర చెబుతున్నది. సుదీర్ఘకాలంలో ఇలాంటి అపురూప ఘట్టాలు మరెన్నో. ప్రతీ కొత్త సంవత్సరంలోనూ వచ్చే మొట్టమొదటి పండుగకూడా ఇదే మరి. అన్ని పండుగల మాదిరిగానే దీనినీ అత్యంత అట్టహాసంగా జరుపుకోవాలనే అందరికీ ఉన్నది. కానీ, అటు కరోనా విజృంభణ, ఇటు గతి తప్పిన ఋతుపవనాలు.ఉగాది అంటేనే షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణం, ప్రాకృతిక పారవశ్యత. ఏడాదిపాటు ఎదురయ్యే కష్టసుఖాలను, 12 నెలల కాలం తీరుతెన్నులను పంచాంగకర్తలు ముందే శాస్ర్తోక్తంగా గణించి ఆయా రాశులవారికి వర్తించేలా వెల్లడించడం ఇవాళ్టి ప్రత్యేకత. సంవత్సరం పొడుగునా వచ్చే పండుగలను, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల స్థితులను తెలుసుకొనే అపురూప అవకాశం ఇదే. ఈ కొత్త సంవత్సరంలో ఖగోళ సంబంధమైన ప్రభావం ఆయా వ్యక్తులు, జీవజాతులు, ప్రకృతి వనరులపై ఎలా పడుతుందన్నదీ క్తుప్తంగా పంచాంగాల ద్వారా వారు ప్రజలకు అందిస్తారు. వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలను, గ్రహణాలు, పుష్కరాలు, ఆయా రాశుల సంక్రమణల సమాచారాన్నంతా ఇందులో పొందుపరుస్తారు. ఫలితంగా ఏడాదిపాటు ఒక భరోసా, కావలసినంత మనోబలం సిద్ధిస్తాయి. ‘మానవ జీవితం షడ్రుచుల సమ్మేళనం’ అని చాటడానికే ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తాం.సృష్టి ఆరంభానికి బ్రహ్మదేవుడు ఎంచుకొన్న అత్యద్భుత ముహూర్తంగా ఉగాదిని భారతీయ అత్యంత ప్రామాణిక ధార్మిక గ్రంథం ‘నిర్ణయసింధు’ నిర్ధారించింది. ‘ఉగ’ అంటే నక్షత్రం (సూర్యుడు) నడక. ‘ఆది’ అంటే మొదలవడం. ‘ఉగాది’ అంటే సూర్యుని ప్రయాణం ఈ కొత్త ఏడాది ఈ రోజుతోనే ప్రారంభమవుతుందన్నమాట. పండగ పూట బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి, సూర్యోదయం లోగా స్నాన పూజాదికాలు ముగించాలని ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి. వస్త్రధారణ విషయంలోనూ అంచు కలిగిన పంచెలే వాడాలని వారు చెప్తారు. షడ్రుచుల పచ్చడిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలే ఉంటాయి. ద్వారాలకు మామిడాకుల తోరణాలు కట్టడంలోనూ ఎంతో ధార్మిక ప్రయోజనం ఉన్నట్టు వేదపండితులు చెబుతారు. పంచాంగంలో ఆదాయ వ్యయాల వివరాలతోపాటు ఆ ఏడాదిలో సంభవించే ఫలాలనూ తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి రోజూ పంచాంగ విశేషాలను పాటిస్తూ నియమానుసారంగా జీవించే వారికి ఆరోగ్యభాగ్యాలు సిద్ధిస్తాయనీ మన పెద్దలు భరోసా ఇస్తుంటారు. ‘ఉగాది పచ్చడి’ మన జిహ్వను చైతన్యపరిచినట్లుగానే పంచాంగంలోని శుభసమాచారమూ మనసుకు ప్రేరణనిస్తుంది. పంచాంగాన్ని కేవలం ఫలితాల కోసమే కాకుండా ఏడాది కాల విశేషాలను తెలుసుకోవడానికికూడా చదవడం, వినడం చేయాలని సిద్ధాంతులు అంటారు. వాటిని ఈ ఉగాది నాడే తెలుసుకోవడం ద్వారా అటు పుణ్యం, పురుషార్థం రెండూ సిద్ధిస్తాయన్న నమ్మకం ప్రజలలో ఉంది. ఘడియ- విఘడియలతోసహా ఏడాది కాలాన్ని ఎంతో శ్రమకోర్చి గణించే సిద్ధాంతుల కృషి ఈ సందర్భంగా ఎంతైనా ప్రశంసనీయం.

భారతీయ ఆధ్యాత్మికతకు గుండెకాయ వంటిది అద్వైత సిద్ధాంతం. దీని ప్రకారం సృష్టిలోని స్థలకాలాలన్నీ దైవస్వరూపాలే. జగత్తులోని ప్రతీ అణువులోనూ దేవుడున్నాడన్న నమ్మకం భారతీయులది. అందుకే, ఆచార వ్యవహారాలన్నింటికంటేకూడా దైవం పట్ల భక్తిశ్రద్ధలకే వేదవిజ్ఞానులు అధిక ప్రాధాన్యమిస్తారు. కాలం ‘దైవసృష్టి’ మాత్రమేకాదు, అసలు కాలమే దైవమన్న నమ్మకం మరెంతో గొప్పది. ‘ఋతు: సుదర్శన: కాల: పరమేష్టీ పరిగ్రహ:’ అని విష్ణుసహస్ర నామాలు పేర్కొన్నవి. దీనిని బట్టి, కాలంలోని ఋతువులన్నీ దైవాంశ సంభూతాలే. మొత్తంగా కాలాన్ని నారాయణ స్వరూపంగా, ఈశ్వర ప్రతీకగానూ మనం భావిస్తాం. ‘కాలోస్మి లోకక్షయకృత్ప వృద్ధో’ అన్నది శ్రీ కృష్ణ పరమాత్మ వచనం. శివకేశవులేకాదు, జగజ్జననికూడా కాళికాదేవిగా అవతరించింది. ఈ దృష్ట్యా మొత్తం సంవత్సరాన్ని ‘భగవత్‌ స్వరూపం’గా భారతీయులు ఆరాధిస్తారు. 

వసంతఋతువు ఆగమన వేళలో వచ్చే ఈ పండుగ సందర్భంలోనే ‘వసంత నవరాత్రుల’ను ‘శ్రీరామనవరాత్రులు’గా ఆరాధిస్తాం. ఈ పదిరోజులూ అటు జగన్మాతను, ఇటు శ్రీరాముణ్ణి పూజించడం వల్ల అందమైన, ఆహ్లాదకరమైన ప్రకృతినీ ఆరాధించినట్టే అవుతుందనీ ఆధ్యాత్మికవేత్తలు అంటారు. శిశిరం వెళ్లి, వసంతం రావడాన్ని కోరుకోని వారుండరు. ప్రతీ సంవత్సరం ‘వసంతం’ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా వేయికండ్లతో ఎదురు చూస్తుంటారు. వసంతం (చైత్ర, వైశాఖ మాసాలు) తర్వాత.. గ్రీష్మం (జ్యేష్ఠ, ఆషాఢమాసాలు), వర్ష (శ్రావణ, భాద్రపద మాసాలు), శరత్తు (ఆశ్వీయుజ, కార్తీక మాసాలు), హేమంత (మార్గశిర, పుష్యమాసాలు) ఋతువులు వస్తాయి. చివరిదైన శిశిరఋతువు (మాఘ, ఫాల్గుణ మాసాలు)తో చెట్లు ఎప్పటిలా ఆకుల్ని రాల్చేస్తాయి. కాలమంతా చెట్ల (ప్రకృతి) పైనే ఆధారపడింది. చెట్లు ఆకులు రాల్చిన తర్వాత కొత్తగా చిగుర్చి పూలు పూయడం, ఎండలు కాయడం, వర్షాలు కురవడం, పండు వెన్నెల, శీతల వాతావరణం.. ఇలా అన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవే. ఇదే కాలపురుషుని నిరాకార రూపం. అందుకే, ఈ వసంతోదయ వేళ ఆ కాలభగవానుని ఆరాధనను మించిన ధార్మికభావన మనకు మరొకటి ఉండదు.

అప్పుడే అసలైన ఆనందం

వసంత నవరాత్రులలో పూజాదికాలు నిర్వహించే వారికి సంవత్సరం పొడుగునా ఆనందభాగ్యాలు సిద్ధిస్తాయని వైదిక పండితులు చెప్తారు. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కోనాటి తిథికి ఒక్కో ప్రాధాన్యం ఉంటుంది. చివరిరోజు జగన్మాత భవానీ రూపంలో అవతరిస్తుందని చెప్తారు. నవమినాడు శ్రీరాముని జన్మదినంగా భావించి, ఆ రోజు లోకహితార్థం ‘సీతారాముల కళ్యాణం’ జరుపుకొంటాం. ఇంటింటా ఆనందం వెల్లివిరిసే ఈ శుభతరుణాన కరోనా వంటి రక్కసి రోగాలను, దుర్భిక్షాల వంటి దౌర్భాగ్యాలను పారదోలే శక్తిని ఈయమని వేడుకోవడం తప్ప మనకు మరో కోరికంటూ ఏముంటుంది!

దోర్బల బాలశేఖరశర్మ


logo