శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 19, 2020 , 01:50:15

వైకుంఠ పురమా, మాటలా?

వైకుంఠ పురమా, మాటలా?

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సర: ప్రాంతేందు కాంతోప లో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము ‘పాహిపాహి’ యన గుయ్యాలించి సంరంభి యై ॥
- శ్రీమద్భాగవతం, (గజేంద్రమోక్షం: 8-95)

అప్పుడు వైకుంఠ లోకంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడన్న దానిని పోతనామాత్యుడు ఈ పద్యంలో గొప్పగా వర్ణించాడు. ఇప్పుడు అరవై వయసు నిండిన, దాటిన వారికి ఈ పద్యం కంఠతా వస్తుండవచ్చు. కానీ, ఈ తరం వారికి వినడమే తప్ప, చదివింది లేదు. కొద్దిసార్లు బట్టీయం పడితే అదే నోటికి వచ్చేస్తుంది. శ్రీమహావిష్ణువు నెలవై ఉండే ఆ వైకుంఠపురం అక్కడ ఎక్కడో మూలన ఉన్నది. అక్కడి మహాసౌధానికి దగ్గర్లోనే అద్భుతమైన కల్పవృక్ష వనం. దాని లోపల ఓ అమృత సరోవరం. అక్కడి ఒక అందమైన చంద్రకాంత శిలపైన పరిచివున్న ఒక కలువ పూల పానుపుమీద శ్రీన్నారాయణుడు చంటిపిల్లవాని వలె ఆడుకొంటున్నాడు. అర్థాంగి లక్ష్మీదేవి పక్కన కూర్చుని, ఆమె పైటకొంగును చేతితో పట్టుకొని, వేళ్లకు చుట్టుకొంటూ ఉన్నాడు. ఒకవైపు అనేకమంది ఋషులు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు వంటివారంతా ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతటి ఏకాంత వేళలోనూ గజేంద్రుని పిలుపును శ్రీమన్నారాయణుడు విన్నాడు. తననే శరణాగతి అంటున్న ఆ భక్త శిఖామణి అయిన గజేంద్రుని (పూర్వజన్మలో ఓ గంధర్వుడు, శాపప్రభావంతో అలా ఏనుగుగా జన్మిస్తాడు) మొసలి బారినుంచి కాపాడడానికి ఉన్నఫలాన బయల్దేరతాడు.

తాజావార్తలు


logo