e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home చింతన రామదూతం నమామి!

రామదూతం నమామి!

లోకాలను ఎల్లవేళలా సంరక్షించే విలక్షణ దైవం హనుమంతుడు. హనుమద్దర్శనం, స్మరణ, పూజలవల్ల భూత ప్రేత పిశాచాల పీడలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారతీయ సంస్కృతి, చరిత్రలో హనుమంతుడి విగ్రహం, ఆలయం లేని గ్రామాలు దాదాపు ఉండవు. భయ నివారకుడై ధైర్యాన్ని ప్రసాదించే ఆంజనేయుడు చిరంజీవి. సీతా వియోగ కాలంలో శ్రీరామచంద్రునికే అండగా నిలిచి మానసిక స్థయిర్యాన్నిచ్చిన గొప్ప బుద్ధి బలశాలి. 

యదివా త్రిదకేశానాం నదక్ష్యాస్కృతశ్రమః 

- Advertisement -

బధ్వా రాక్షస రాజా మానయిష్యామిరావణః. 

-పురాణపండ రాధాకృష్ణమూర్తి (హనుమచ్చరిత్ర)

‘ఒకవేళ స్వర్గంలో కూడా సీతాదేవి దొరకక పోతే, త్రైలోక్య విజేత తానై రాక్షస రాజైన రావణాసురుని బంధించి తెస్తాననే’ నమ్మకాన్ని కల్గించిన సేవాదురంధరుడు అభయాంజనేయ స్వామి. వానరయోధుడైన హనుమ పరాక్రమశాలియై, నిష్కాముడై ధర్మాన్ని, భక్తులను సంరక్షించడంలో ధీశాలి. ఆయనలోని సమర్పణ, త్యాగం, కర్తవ్యనిష్ఠలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని హనుమత్‌ తత్త్వం మనకు బోధిస్తున్నది.

‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన’ (భగవద్గీత, సాంఖ్యయోగం: 2-47) అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అదే విధంగా ఫలం ఆశించకుండా కర్తవ్య నిర్వహణ చేయాలన్నది కూడా ‘పింగాక్షుని’ (సూక్ష్మదృష్టి గలవాడు, ఆంజనేయుడు) సందేశం. బుద్ధి, ఫలం, వాక్పటుత్వం వంటి విషయాల్లో బ్రహ్మచారులకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు హనుమ. స్థిర మానసిక స్థితిని కలిగించే శుక్రధాతువును రక్షించుకొంటూ, మనోవాక్కు, కాయకర్మలను నియంత్రించుకొంటూ, దీక్షతో పని చేయటం బ్రహ్మచారుల కర్తవ్యం. ఇవన్నీ హనుమంతుని స్మరణ, అర్చనలతో సిద్ధిస్తాయి. మానసిక చంచలత్వం, నవగ్రహాల గమనం అనుకూలంగా లేదన్న భయాందోళన, వీటివల్ల ఎదురయ్యే కష్టనష్టాలన్నీ ఆంజనేయస్వామి అర్చన, ఆరాధనలతో తొలగి పోతాయని వేద సంస్కృతి చెబుతున్నది. 

ఆంజనేయుని పాదాలను ‘నవగ్రహ స్వరూపం’గానూ భావిస్తారు. భూత, ప్రేత, పిశాచాలు, దృష్టి దోషం ప్రజలపై పడకూడదనే ఉద్దేశ్యంతోనే గ్రామాలు, పట్టణాల సరిహద్దుల్లో భారీ ఆంజనేయుని విగ్రహాలు నెలకొల్పి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది.

అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం 

దనుజవన కృశానుంజ్ఞానినామగ్రగణ్యం 

సకలగుణ నిదానం వానరాణామధీశం 

రఘుపతి ప్రియభక్తం రామదూతం నమామి. 

-హనుమచ్చరిత్ర

ఆవేదనలో ఉన్న భక్తులెందరికో ఓదార్పు నిచ్చి మానసిక శాంతిని ప్రసాదిస్తాడు హనుమంతుడు. రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన వేళ స్నేహితుడుగా రామచంద్రమూర్తిని ఓదార్చాడు. సేవకునిగా సంజీవిని తెచ్చి కాపాడాడు. సోదరునిగా ప్రేమను అందించాడు. రాత్రి నిద్రలో కలలు వచ్చి భయపడేవారికి ‘రామస్కంధం హనుమంతం’ స్మరణ మాత్రంగానే భయం పోగొడతాడనే విశ్వాసం ఉంది. జిల్లేడు పూలతో హనుమంతునికి పూజ చేయడం వల్ల సూర్యతేజస్సు లభిస్తుంది. తమలపాకులు, మినుపగారెల మాలలు స్వామికి సమర్పించడమూ ఆనవాయితీగా వస్తున్నది. 

హనుమంతుని మండల దీక్షలవల్ల ప్రజలలో భక్తిభావనతో సహా పరస్పర సహకారం పెరగడమేకాక వైరాలు దూరమవుతాయి. దీక్షాదక్షతలతో అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి కావలసిన ప్రేరణను అంజన్న ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ రక్షకభటునిగా, గురువుగా, నాయకునిగా అభయాంజనేయ స్వామి భక్తులకు భరోసా ఇస్తుంటాడు. ఆయనను నిరంతరం కొలిచేవారికి సర్వసౌభాగ్యాలు చేకూరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మాడుగుల నారాయణమూర్తి

94411 39106

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement