e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home చింతన నవవిధ భక్తి తత్తం!

నవవిధ భక్తి తత్తం!

‘భజ సేవాయామ్‌’ అన్న సూత్రాన్ని అనుసరించి, ‘భక్తి’ అంటే ‘సేవ’. దేవునికి చేసే సేవ. ‘అవాంతరాలకు లొంగని నిరంతర ప్రేమ ప్రవాహమే భక్తి’ అని భగవద్రామానుజులవారు ఉద్బోధించారు. ‘సర్వాధికమైన స్నేహభావమే భక్తి’ అని శ్రీమధ్వాచార్యులవారు నిర్వచించారు. ‘పరమేశ్వరుని పాదారవిందాలను చేరిన మానసిక ప్రవృత్తియే భక్తి’ అని జగద్గురు ఆదిశంకరాచార్యులవారు సోదాహరణంగా వివరించారు. భక్తిచే పరమాత్మను భజించుటకు పక్షి, జంతు, మానవ భేదాలు కాని, స్త్రీ-పురుష భేదం కాని, ధనిక-దరిద్ర భేదం గాని, విద్యావంతుడు- విద్యాహీనుడు అనే భేదం కాని, కుల, మత, వర్గ ప్రాంత వయో భేదాలు కానీ ఏమీ లేవు. వైనతేయుడు చేసిన పుణ్యమేమి? గజేంద్రుడు ఏపాటి విద్యావంతుడు? గుహునిది ఏ రకం సదాచార నిష్ఠ? కుచేలుడి అటుకులకు ఉన్న విలువ ఎంత? కంసుని ఆస్థానంలోని కుబ్జ సౌందర్యం ఎంత గొప్పది?భగవంతుడు కేవలం భక్తికి మాత్రమే కట్టుబడి ఉంటాడు. కాబట్టే, భగవంతునికి ‘భక్తవ శంకరుడు’ అన్న పేరొచ్చింది. శ్రీమద్భాగవతం భక్తిని నవవిధాలుగా పేర్కొంది.
‘శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాద సేవనమ్‌,
అర్చనమ్‌, వందనమ్‌, సఖ్య మాత్మ నివేదనమ్‌’

అన్నది భాగవత శ్లోకం. నవవిధ భక్తిమార్గాల్లోని ఈ క్రమాన్ని గమనిస్తే- ‘శ్రవణం’ అంటే ‘వినడం’తో ప్రారంభించిన భక్తితత్తం, ‘నివేదనం’ అంటే ‘విన్పించడం’తో పూర్తవుతుంది. భగవంతుని గురించి విని తెలుసుకోవాలి. అతని కీర్తనను గానం చేయాలి. భగవన్నామాన్ని నిత్య స్మరణ చేయాలి. అర్చనాది విధి విధానాలను నిర్వర్తించాలి. ఈ భౌతిక ప్రక్రియలన్నీ అయ్యాక, భక్తుడు దాసుని స్థితిని దాటి సఖుని స్థాయికి ఎదగాలి. మానసికమైన ఒక పతాక స్థాయిలో స్థిరపడాలి. అది ‘ఆత్మ నివేదనం’ కావాలి. ఇదొక క్రమానుగతమైన పరిణామం. ‘నివేదనం’ అంటే, వినిపించడమే; చెప్పుకోవడమే అన్న అర్థంలో మనం ఉన్నంతవరకు అది భౌతికం; కానీ, ‘నివేదనం’ అంటే ‘సమర్పణ’మనే భావన స్ఫురిస్తే, అదొక మానసిక పరిణతికి ప్రతీక.

- Advertisement -

పరీక్షిత్‌ మహారాజు శ్రీ మహావిష్ణువు లీలా విలాసాలు, విశేషాలన్నీ శ్రవణం చేత; శుక మహర్షి, నారద మహర్షి ఆ భగవంతుణ్ణి సంకీర్తనం చేత; భక్త ప్రహ్లాదుడు నిరంతర భగవన్నామ స్మరణం చేత; శ్రీహరి దేవేరి శ్రీమహాలక్ష్మి స్వామి పాదపద్మ సంసేవనం చేత; పృథు మహారాజు సకలోపచారాలతో ఆ పరబ్రహ్మను పూజించుట చేత; అక్రూరుడు వందన మాచరించుట చేత; హన్మంతుడు త్రికరణ శుద్ధిగా తాను రామదాసుడనని చెబుతూ చేసిన దాస్యం చేతను; అర్జునుడు, కుచేలుడు ప్రకటించిన నిష్కామ సఖ్యత చేతను; సర్వస్వాన్ని సమర్పణ చేసిన బలి చక్రవర్తి ఆత్మ నివేదన చేతను; శ్రీరామచంద్రుని కరుణా కటాక్షంచే జీవం పొందిన గ్రావం అహల్య తన ఆత్మనే ఆతిథ్యంగా అందించడం చేతను భగవదనుగ్రహానికి పాత్రులై, పావనులై తరించారు. జగద్విఖ్యాతులయ్యారు.
అందుకే, నవవిధ భక్తిమార్గాల్లో మనకు ఏ మార్గం అనువైందో, అనుకూలమైందో దాన్నే స్వీకరించి భక్తులుగా తరించవచ్చు. పూవు వికసించినా, పరిమళించినా అది తొడిమను కూడి ఉన్నంత సేపే. ఒకసారి ఆ పువ్వు నేల పాలైందంటే ఇక అంతే! వికసనం లేదు. పరిమళమూ లేదు. రెండూ అంతరించిపోతాయి. అలాగే, జీవుడు కూడా దేవుడి పాదాలను పట్టుకున్నంత కాలమే అతని ప్రభ; వదిలేస్తే ఏముంది, శూన్యమే!

-డా॥ కె.వి.రమణ ,98480 98990

ఇవీ కూడా చదవండి..

అమ్మా లేమ్మా.. ఆకలవుతుంది!

మాటలతో రెచ్చగొట్టి.. కాసులు కొల్లగొట్టి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement