లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయి. కూతురికి తనతో పెండ్లి చేసేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ గొంతు కోసిన యువకుడి ఉదంతం లక్నోలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని సదత్గంజ్ ప్రాంతానికి చెందిన నిందితుడు ఆర్మాన్ అదే ప్రాంతానికి చెందిన షరీఫ్ జహన్ కూతురిపై ఇష్టం పెంచుకున్నాడు. ఆపై ఆమెకు తనతో వివాహం జరిపించాలని జహన్ను కోరగా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది.
తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆగ్రహానికి లోనైన ఆర్మాన్ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో జహన్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆపై ఖాళీ కాగితంపైన బలవంతంగా ఆమె వేలిముద్రను తీసుకుని పరారయ్యాడు. జహన్ కేకలు వేయడంతో స్ధానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.