లక్నో : మీరట్ బాంక్వెట్ హాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మృతురాలి వరుసకు సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై లైంగిక దాడి ప్రయత్నం విఫలం కావడంతో ఆమెను ఊపిరిఆడకుండా చేసి చంపినట్టు నిందితుడు (22) అంగీకరించాడు. బాంక్వెట్ హాల్లో సోమవారం పెండ్లి జరుగుతుండగా యువతి (19) హత్య వెలుగుచూడటం కలకలం రేపింది.
హత్య జరిగిన అనంతరం ఆమె కజిన్ కనిపించడం లేదని బంధువులు, కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించిన తర్వాత సైతం నిందితుడు ఎక్కడా కనిపించకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. కోరిక తీర్చేందుకు నిరాకరించడంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు.