ముంబై : తన సవతి సోదరుడికి తెలియకుండా రూ. 100 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించిన 58 ఏండ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.ముంబైలోని అత్యంత ఖరీదైన లోయర్ పరేల్ ప్రాంతంలోని ఆస్తిలో సోదరుడికి సమాన వాటా ఉన్నా అతడికి సమాచారం అందించకుండా ఆమె విక్రయించారు.
మహిళపై ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిని అబిదా ఇస్మాయిల్‌గా గుర్తించిన ముంబై పోలీసులు కర్నాటకలోని మైసూర్లో ఓ హాటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. అబిదాపై సవతి సోదరుడు ఆయాజ్ కపాడియా ఫిర్యాదు చేశారు. అబిదా ఇటీవల తనకు తెలియకుండా ఓ డెవలపర్‌తో విక్రయ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయాజ్ ఇటీవల గుర్తించాడు.
ఆస్తికి సంబంధించిన కీలక సమాచారాన్ని దాచి నకిలీ డాక్యుమెంట్లతో తామే పూర్తి యజమానులమని చెబుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లాంఛనాలు నిర్వహించారని ఆయాజ్ ఆరోపించాడు. మహిళపై ముంబై పోలీసుల ఆర్ధిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేయడంతో అబిదాను మైసూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.