ముంబై : పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, కఠినమైన చట్టాలను తీసుకువస్తున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Crime) రెచ్చిపోతున్నారు. పోలీసుల కండ్లుగప్పి ప్రజలను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు వినూత్న పద్ధతులతో బురిడీ కొట్టిస్తున్నారు. ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఆన్లైన్లో ఖాతాల్లోని సొమ్ములను ఖాళీ చేస్తున్నారు. తాజాగా ముంబైలో ఓ మహిళ తన న్యూ అండ్రాయిడ్ ఫోన్లో క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేయిస్తూ రూ. ఏడు లక్షలు పోగొట్టుకున్న ఘటన వాణిజ్య రాజధానిలో కలకలం రేపింది. ఆమె తన క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసుకునేందుకు ఐఫోన్ నుంచి న్యూ అండ్రాయిడ్ ఫోన్‌కు మారే క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కారు.
ముంబైలోని పన్వేల్‌కు చెందిన మహిళ ఉచిత అండ్రాయిడ్ ఫోన్‌తో పాటు క్రెడిట్ కార్డు ఆఫర్ చేసిన మాయగాడి వలలో పడి రూ. 7లక్షలు పోగొట్టుకున్నారు. బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్న సౌరభ్ శర్మ బాధితురాలి(40)కి ఫోన్ చేసి నగరంలోని స్పోర్ట్స్ క్లబ్లో సభ్యత్వంతో పాటు న్యూ క్రెడిట్ కార్డును ఆఫర్ చేశాడు. ఈ ఆఫర్‌పై సంతృప్తి చెందిన మహిళ న్యూ క్రెడిట్ కార్డు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు ఆమె నిందితుడికి తన ఆధార్ కార్డు సహా వ్యక్తిగత వివరాలు అందించింది. మహిళ ఐఫోన్ వాడుతుండటంతో క్రెడిట్ కార్డును అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తోనే యాక్టివేట్ చేయాలని నిందితుడు శర్మ నమ్మబలికాడు.
తాను పంపే న్యూ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలని సూచించారు. న్యూ అండ్రాయిడ్ ఫోన్ పొందేందుకు ఆమె తన అడ్రస్‌ను నిందితుడికి పంపింది. అదేరోజు న్యూ స్మార్ట్‌ఫోన్ మహిళకు అందింది. అందులో డాట్ సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ అథెంటికేటర్ అనే రెండు యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇక న్యూ స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ వేసుకుని క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని శర్మ మహిళకు సూచించాడు.
నిందితుడు చెప్పిన ప్రక్రియను మహిళ అనుసరించా కొద్ది గంటల తర్వాత తన క్రెడిట్ కార్డు నుంచి రూ. 7 లక్షల లావాదేవీలు చేసినట్టు రెండు మెసేజ్‌లు రావడంతో షాక్‌కు గురైంది. బెంగళూర్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో ఈ లావాదేవీలు జరిగినట్టు వెల్లడైంది. మోసపోయానని గ్రహించిన మహిళ బ్యాంకు అధికారులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.