యాదాద్రి భువనగిరి : వీధి కుక్కలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ జనాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో వీధి కుక్కలు మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
కోటమర్తి గ్రామానికి చెందిన చిత్తలూరి పూలమ్మ తన ఇంటి నుంచి ఓ దుకాణానికి వెళ్తుండగా, ఆమెను వీధి కుక్కలు టార్గెట్ చేశాయి. పూలమ్మను వీధి కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. దాదాపు 10 కుక్కలు 10 నిమిషాల పాటు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అయితే కుక్కలను తరిమేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం భువనగిరిలోని ఏఎంఆర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.