పాట్నా : భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. నిన్నటి వరకు పెళ్లి పనులు చకచకా ముందుకు కొనసాగాయి. కానీ చిన్నారి మృతితో పెళ్లి పనులు ఆగిపోయాయి. కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు.
బీహార్లోని వైశాలి జిల్లాలోని నయాగావ్ వద్ద ఓ పూజా కార్యక్రమానికి వెళ్లిన భక్తులపై ట్రక్కు దూసుకెళ్లడంతో.. 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఒకరైన చిన్నారి లక్ష్మీ ఇంట్లో నవంబర్ 25వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో పెళ్లి పనులు ఆగిపోయాయి.
లక్ష్మీ మృతితో ఆమె తండ్రి మిథు రాజ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మా మేనల్లుడి పెళ్లి నవంబర్ 25న జరగాల్సి ఉంది. కానీ నా కూతురు అంతలోనే చనిపోయింది. ట్రక్కు దూసుకెళ్లడంతో మా పాప చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించాడు. మా ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు రాజ్.