ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ మురళీధర్ తెలిపారు. కాచిగూడ ఏసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏడీసీపీ మురళీధర్ కేసు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్దం స్వామి అనే వ్యక్తి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతున్నాడని, అతనితో పాటు, అతని సర్టిఫికెట్ అసలైనదేనని ధృవీకరించిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు.
ముద్దం స్వామి ప్రస్తుతం న్యూయార్క్‌లోని పేస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్‌ను సీపీ ఆదేశించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన రమేశ్‌నాయక్ ఆ సర్టిఫికెట్లు నకిలీవేనని తేల్చాడని, అవి నకిలీవిగా ఓయూ అధికారులు ధృవీకరించారని వివరించారు.
దీంతో సోమవారం రాత్రి ఐపీసీ 467, 471, 420 సెక్షన్ల కింద కైం నెంబర్ 87/2022తో కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ కోసం కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్, డీఐ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.