న్యూఢిల్లీ: దోపిడీ దొంగలు రోజురోజుకు తెగబడుతున్నారు. కష్టపడి పనిచేయడం చేతగాక పరుల కష్టార్జితాన్ని దోచుకుంటూ పబ్బం గడుపుతున్నారు. దోపిడీకి పాల్పడే సమయంలో వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తులను తీవ్రంగా కొట్టడానికి, చంపడానికి కూడా వెనుకాడటం లేదు. కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలతో ఇండ్లు, దుకాణాల్లో చొరబడి ఏ మాత్రం భయం లేకుండా దర్జాగా దోచుకెళ్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది.
ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ ఏరియాలోగల ఓ హార్డ్వేర్ షాపులో శనివారం మధ్యాహ్నం ముగ్గురు దొంగలు తుపాకులతో చొరబడ్డారు. క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తితో సహా దుకాణంలో ఉన్న నలుగురిని కొట్టి ఒకవైపుకు పంపించారు. అనంతరం దుకాణంలో నగదు కోసం వెతుకగా కనిపించలేదు. దాంతో క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని పిలిచి నగదు తీసి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అతడు చేసేదేమీ లేక టేబుల్ సొరుగులో ఉన్న నగదు తీసిచ్చాడు. ఇచ్చిన డబ్బులు తీసుకుని దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు.
ఈ దృశ్యాలన్నీ ఆ దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, ఘటనపై హార్డ్వేర్ దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Two unknown miscreants looted a hardware shop at gunpoint in Delhi's Khera Khurd area, yesterday pic.twitter.com/DI8Izx5Ky1
— ANI (@ANI) September 5, 2021