లక్నో: ఆహారం వడ్డించడం ఆలస్యమైనందుకు ఒక తండ్రి తన కుమార్తెను హత్య చేశాడు. అయితే మృతురాలికి వారం రోజుల్లో పెళ్లి జరుగాల్సి ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాబుగఢ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మహ్మద్ ఫరియాద్‌కు ఆరుగురు సంతానం. రెండో కుమార్తె రేష్మను అతడు ఆహారం అడిగాడు. అయితే వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో కుమార్తెపై అతడు రంకెలు వేశాడు. ఈ సందర్భంగా రేష్మ కూడా ఘాటుగా బదులులిచ్చింది. దీంతో ఆగ్రహించిన ఫరియాద్ గడ్డిని కత్తిరించే బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రేష్మ రక్తం మడుగుల్లో పడి అక్కడికక్కడే చనిపోయింది.
విషయం తెలిసిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు. రక్తం మడుగుల్లో పడి మరణించిన రేష్మా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, 22 ఏళ్ల రేష్మకు సెప్టెంబర్ 4న పెళ్లి జరుగాల్సి ఉందని స్థానికులు తెలిపారు. వారం రోజుల్లో పెళ్లి చేసుకుని మెట్టింటికి వెళ్లాల్సిన అమ్మాయి తండ్రి చేతిలో చనిపోవడంపై ఆ కుటుంబంతోపాటు స్థానికులు విచారం వ్యక్తం చేశారు.