UP Murder : కుటుంబాన్ని వదిలి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడో వ్యక్తి. ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిక్వాపూర్ గ్రామానికి చెందిన రేష్మ భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. భర్త మరణం తర్వాత రేష్మ, తన ఇంటి సమీపంలో ఉండే గోరెలాల్ అనే వ్యక్తికి దగ్గరైంది.
నెమ్మదిగా అతడితోనే ఉంటూ పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది. దీంతో పిల్లలు ఆమెను వదిలి, దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఇదే సమయంలో రేష్మ, గోరేలాల్ తో కలిసి వేరే చోట ఉండేవారు. దీంతో కొంతకాలంగా పిల్లలకు, ఆమెకు మధ్య సంబంధాలు లేకుండా పోయాయి. అయితే, గత నవంబర్ 29న రేష్మ కొడుకు బబ్లూ తన తల్లికి ఫోన్ చేశాడు. బంధువుల వివాహానికి పిలవాలనుకున్నాడు. కానీ, అటువైపు నుంచి గోరేలాల్ మాట్లాడాడు. తన తల్లిని మర్చిపోవాలని, ఆమె ఇక రాదని చెప్పాడు. అయితే, అనుమానం వచ్చిన బబ్లూ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోరేలాల్ ను విచారించగా.. ఒళ్లు గగుర్పొడిచే వివరాలు వెల్లడించాడు. రేష్మను పదినెలల క్రితమే హత్య చేసినట్లు చెప్పాడు.
గత ఏప్రిల్ లో రేష్మకు, గోరెలాల్ కు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరోజు రేష్మను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజులు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచుకున్నట్లు తెలిపాడు. మొదట దగ్గర్లోని నదిలో పడేద్దామనుకున్నా.. నీటిలో తేలుతుందని ఆలోచించి.. దగ్గర్లో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. చివరకు పది నెలల తర్వాత అతడు చేసిన హత్య వెలుగు చూసింది. ఘటనా స్థలం నుంచి పోలీసులు రేష్మ అస్థిపంజరాన్ని తవ్వి తీశారు. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.