న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో కిడ్నాప్‌నకు గురైన ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో శవాలై కనిపించారు. మరో బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమన్ (13), విపిన్ (8), శివ (6) ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురు సోదరులను ఈ నెల 15న రాజస్థాన్‌లోని అల్వార్‌లో కిడ్నాప్‌నకు గురయ్యారు. ఆ తర్వాత కిడ్నాపర్లు ముగ్గురు పిల్లల తండ్రి గుసన్ సింగ్‌కు ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారు.
పిల్లల తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కాల్ ఆధారంగా ట్రాక్ చేశారు. ఢిల్లీ పోలీసులతో కలిసి రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత పిల్లలను హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. మెహ్రౌలీలోని అటవీ ప్రాంతంలో శవాలను పాతిపెట్టినట్లు చెప్పగా.. సంఘటనా స్థలం నుంచి అమన్, విపిన్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మూడో బాలుడు శివ సైతం చనిపోయాడని భావించిన దుండగులు అక్కడే వదిలే వెళ్లడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.
బాలుడు సరైన వివరాలు తెలుపకపోవడంతో అప్పటికే అతన్ని బాలల పునరావాస కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులు ఇద్దరు పిల్లలను గొంతుకోసి హత్య చేశారని, పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నిందితుడు బిహార్‌కు చెందినవాడని, అల్వార్‌లోని భివాడిలో బాధిత కుటుంబానికి దగ్గరలోనే నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్‌కు బాలిసలై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడరని పోలీసులు తెలిపారు. ఓ నిందితుడు దుకాణం నడుపుతుండగా.. మరో నిందితుడు ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడని వివరించారు.