ముంబై : పోలీసులుగా ఫోజులు కొడుతూ బస్సు ప్రయాణీకుల నుంచి రూ 1.12 కోట్లు లూటీ చేసిన ముగ్గురు నిందితులను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రాందాస్ భోసలే (30), తుషార్ తంబే (22), భరత్ బంగర్(36)గా గుర్తించారు. ముగ్గురు నిందితులు షిరూర్కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈనెల మొదటి వారంలో లాతూర్ నుంచి ముంబైకి వెళుతున్న బస్సులో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్ట్ 3న ముగ్గురు నిందితులు పోలీస్ యూనిఫాం ధరించి పుణే-షోలాపూర్ హైవేపై బస్సును అడ్డగించి అందులో ప్రయాణిస్తున్న కొరియర్ సంస్ధ ఉద్యోగుల నుంచి రూ కోటికి పైగా నగుదను దోపిడీ చేసి పరారయ్యారు.
బాధితుల్లో ఒకరైన హితేంద్ర జాదవ్ పుణే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్ధలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను ఖరాది బైపాస్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. బాధితుడు మరో ముగ్గురు సహచరులు కొరియర్ కంపెనీల్లో పనిచేస్తూ లాతూర్ నుంచి ముంబైకి భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారు. పోలీసు యూనిఫాంలో బస్సులోకి ప్రవేశించిన నిందితులు కొరియర్ ఉద్యోగులను తనిఖీ పేరుతో బయటకు దింపి వారిపై దాడి చేసి నగదుతో ఉడాయించారు. నిందితుల నుంచి పోలీసులు చెరుకుతోటలో దాచిన రూ 85 లక్షల నగదు, రూ ఏడు లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఓ కారు, రెండు బైక్లు, రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.