గువాహటి: అశ్లీల వీడియో చూసేందుకు నిరాకరించిన బాలికను ముగ్గురు మైనర్ బాలురు హత్య చేశారు. అస్సాం నాగావ్ జిల్లాలోని కలియాబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఉలుఒనిలోని బాలిబాత్ సమీపంలో ఉన్న స్టోన్ క్రషింగ్ మిల్లు టాయిలెట్లో మంగళవారం ఆరేండ్ల బాలిక మృతదేహం కనిపించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు 24 గంటల్లో మర్డర్ మిస్టరీని ఛేదించారు. 8 నుంచి 11 ఏండ్ల వయసున్న ముగ్గురు బాలురతోపాటు ఒక నిందితుడి తండ్రిని బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు వారిని ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టారు.
11 ఏండ్ల బాలుడు తన తండ్రి మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవాడు. అతడితోపాటు మరో ఇద్దరు బాలురు కూడా పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆరేండ్ల బాలికను అశ్లీల వీడియోలు చూడాలని వారు బలవంతం చేశారు. ఆమె నిరాకరించగా లైంగికంగా వేధించడంతోపాటు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ విషయం తెలిసినప్పటికీ దాచి పెట్టేందుకు యత్నించిన 11 ఏండ్ల బాలుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. బాలిక హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.