మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింహనగర్లో భారీ చోరీ జరిగింది. చోరీ చేసే సమయంలో గోడలపై ఇంటి పరిసర ప్రాంతాల్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన అక్టోబర్ 31వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బోడ లక్ష్మీ ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం…జిల్లా కేంద్రం శివారు ముడుపుగల్ రోడ్డులోని నర్సింహానగర్లో బోడ లక్ష్మీ తన ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్నారు. కాగా, గత నెల 29 తేదీన ఉదయం 9 గంటలకు తమ బంధువు మృతి చెందినట్లు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహనగర్లోని ఇంటి తాళం వేసి లక్ష్మీ తన ఇద్దరి కూతుళ్లతో కర్ణాటక వెళ్ళారు.
అనంతరం లక్ష్మీ తన ఇద్దరి కూతుళ్లతో అక్టోబర్ 31 తేదీన ఉదయం11గంటలకు ఇంటికిచేరుకోగా ఇంటి తాళాలు పగులకొట్టి కనిపించింది. బీరువా పగులకొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్ననగలతో పాటు మొత్తం 33న్నర తులాల బంగారు ఆభరణాలు, బీరువాలో దాచి ఉంచిన రూ. 9.70 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్ సీఐ జూపల్లి వెంకటరత్నం వెల్లడించారు.