బెంగళూర్ : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తండ్రిని స్నేహితులతో కలిసి అంతమొందించిన టీనేజర్ సహా ముగ్గురు మైనర్లను బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి దీపక్ (45) లైంగికంగా వేధిస్తుండటంతో మరో దారిలేక స్నేహితులతో కలిసి హతమార్చానని బాధిత బాలిక వెల్లడించింది. యలహంక న్యూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన దీపక్ నగరంలోని జీకేవీకే క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి దీపక్ నివసిస్తుండగా పెద్ద కూతురు ఓ ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతోంది.
ఇతనికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య బిహార్‌లో ఉంటోంది. కర్నాటకకు చెందిన రెండవ భార్య ఆమెకు జన్మించిన ఇద్దరు కూతుళ్లతో కలిసి దీపక్ బెంగళూర్‌లో ఉంటున్నాడు. పెద్ద కూతురిపై కన్నేసిన దీపక్ పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతుండేది. ఇక సోమవారం రోజూలాగే మద్యం సేవించి ఇంటికొచ్చిన దీపక్ కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈసారి తన స్నేహితులను పిలిచిన ఆమె వారితో కలిసి తండ్రిని హతమార్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.