Haridwar : కుటుంబంతో కలిసి గంగానదికి వెళ్లిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి అతడి స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్, హరిద్వార్ పరిధిలోని గంగా నదిలో ఆదివారం ఉదయం జరిగింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన సచిన్ త్యాగి (39), బ్రిజేష్ కుమార్ త్రిపాఠి (43) స్నేహితులు.
వీరి ఇరు కుటుంబాలు అక్కడి ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని ఒకే టవర్‌లో ఉంటున్నారు. సన్నిహితంగా ఉండే ఇరు కుటుంబాలు కలిసి రెండు రోజుల క్రితం వేర్వేరు వాహనాల్లో ఫ్యామిలీ టూర్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం గంగా నదిలో స్నానం చేస్తుండగా, సచిన్ త్యాగి నీళ్లలో జారి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన బ్రిజేష్ కుమార్ అతడిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ, లోతు ఎక్కువగా ఉండటం, వేగంగా నీటి ప్రవాహం ఉండటంతో ఇద్దరూ నీళ్లలో మునిగి కొట్టుకుపోయారు. కుటుంబ సభ్యుల ముందే ఈ ఘటన జరిగింది. స్థానికులు అక్కడే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, గాలింపు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
కొన్ని గంటలసేపు గాలించగా, ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని ఇరు కుటుంబాలకు అందించారు. సచిన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఘటన జరిగిన ప్రదేశంలో గతంలో ఘాట్ ఉండేదని, కానీ, ఇసుక కారణంగా లోతు పెరిగి ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు.